బన్నీ కాళ్ల మీద పడాలని ఉంది'.. 'గేమ్ ఛేంజర్'పై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్స్
ఇప్పుడు ఆర్జీవీ ఎక్స్ వేదికగా ఈ సినిమా కలెక్షన్లపై సెటైర్లు వేశారు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా విడుదల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ. 186 కోట్లు కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ పోస్టర్ వదలడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ ఈ మూవీ బడ్జెట్, వసూళ్లపై షాకింగ్ పోస్టులు పెట్టారు.
'గేమ్ ఛేంజర్' సినిమా ఓపెనింగ్ డే ఒరిజినల్ గా 80 - 89 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తే, రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని మూవీ టీమ్ ఫేక్ పోస్టర్లు వేసినట్లుగా నెటిజన్లు నెట్టింట ట్రెండ్ చేశారు. ట్రేడ్ వర్గాలు సైతం ఈ నంబర్ పై ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆర్జీవీ ఎక్స్ వేదికగా ఈ సినిమా కలెక్షన్లపై సెటైర్లు వేశారు. గేమ్ ఛేంజర్ ను GC అని ప్రస్తావిస్తూ.. తనదైన శైలిలో పోస్టులు పెట్టారు. జీసీకి తొలి రోజే రూ.186 కోట్లు వచ్చింది నిజమే అయితే, 'పుష్ప 2' సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.1860 కోట్లుగా ఉండాలని పేర్కొన్నారు.
"GC (గేమ్ ఛేంజర్) సినిమాకి దాదాపు 450 కోట్లు ఖర్చయ్యింటే.. ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్ అప్పీల్‌లో తీసిన RRR మూవీకి 4500 కోట్లు ఖర్చు చేయాలి ఉండాలి. ఒకవేళ జీసీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 186 కోట్లు అయితే.. 'పుష్ప 2' కలెక్షన్స్ 1860 కోట్లుగా ఉండాలి. నిజం యొక్క ప్రాథమిక ఆవశ్యకత ఏమిటంటే అది నమ్మదగినదిగా ఉండాలి. GC విషయంలో ఆ అబద్ధం మరింత నమ్మదగినదిగా ఉండాలి" అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు.
"ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ లాంటి వారు రియల్ టైమ్ కలెక్షన్‌లతో తెలుగు సినిమాని అద్భుతంగా ఆకాశంలోని స్ట్రాటో అవరణంలోకి తీసుకెళ్ళి, తద్వారా బాలీవుడ్‌లోకి షాక్ వేవ్‌లను పంపిస్తున్నారు. కానీ GC వెనుక ఉన్న వ్యక్తులు సౌత్ వాళ్ళు మోసం చేయడంలో చాలా అద్భుతంగా ఉన్నారని నిరూపించడంలో విజయం సాధించారు. బాహుబలి, RRR, KGF 2, కాంతారా మొదలైన అసాధారణ దక్షిణాది విజయాలను అణగదొక్కే ఈ అత్యంత అవమానకరమైన అవమానం వెనుక ఎవరున్నారో నిజంగా నాకు తెలియదు. GC చర్యల కారణంగా వారి విజయాలన్నీ ఇప్పుడు సందేహాస్పదంగా ఉన్నాయి"
"ఈ నమ్మశక్యం కాని అమాయకపు అబద్ధాల వెనుక ఎవరున్నారో నాకు తెలియదు కానీ, ఖచ్చితంగా అది నిర్మాత దిల్ రాజు మాత్రం కాదు. ఎందుకంటే అతను నిజమైన గ్రౌండెడ్ రియలిస్ట్ పర్సన్. అతనికి ఫ్రాడ్ చేయడం చేతకాదు" అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి "నాకు పుష్ప-2 నచ్చింది కానీ ఇప్పుడు GC చూసిన తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ల మీద పడాలని ఉంది" అంటూ మరో పోస్ట్ పెట్టారు. ఇలా 'గేమ్ ఛేంజర్' మూవీపై రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.