నేషనల్ అవార్డ్.. 'కాంతారా' నటుడి ఎమోషనల్ పోస్ట్!
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు రిషబ్ శెట్టి.
70వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీ వేదికగా గ్రాండ్ గా జరిగింది. 2022 సంవత్సరానికి గానూ వివిధ భాషల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. వారిలో వీరిలో కన్నడ హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. 'కాంతారా' సినిమాలో ఆయన అధ్బుతమైన నటన కనబరిచినందుకు గానూ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డును ఆందుకున్నారు. ఈ నేపథ్యంలో రిషన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు రిషబ్ శెట్టి. ఈ వేడుకకు సాంప్రదాయ బద్దంగా పంచెకట్టులో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. అవార్డులతో దిగిన ఫొటోలను ఎక్స్ లో పంచుకుంటూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తమను ముందుకు నడిపించిన ప్రేమకు ప్రతిబింబమని, ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నారు.
"ఒక విజన్‌గా ప్రారంభమై మీ అందరి ప్రేమ, అభిరుచి నమ్మకంతో నిండిన ప్రయాణంగా మారింది. ఈరోజు జాతీయ అవార్డుతో గర్వంగా నిలబడితే మా హృదయాలు కృతజ్ఞతతో ఉప్పొంగిపోతున్నాయి. ఈ గౌరవం మాది మాత్రమే కాదు. మీ అన్ కండిషనల్ సపోర్ట్ కు, ప్రతి అడుగులో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లిన మీ ప్రేమకు ప్రతిబింబమే ఈ అవార్డ్. ఈ కలను నిజం చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 'కాంతారా' మీది. మీ ప్రేమకు మేము ఎప్పటికీ కృతజ్ఞులమే" అంటూ రిషబ్ పోస్ట్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ తండ్రి ముఖేష్ గౌతమ్ కూడా నేషనల్ ఫిలిం అవార్డును అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన 'బాఘీ దీదీ' బెస్ట్ పంజాబీ మూవీగా ఎంపికైన నేపథ్యంలో, రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు ముఖేష్. ఈ ఫొటోను యామీ గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. "ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ‘బాఘీ దీధీ’ సినిమాకు మా నాన్న శ్రీ ముఖేష్ గౌతమ్ దర్శకుడిగా మొదటి జాతీయ అవార్డును అందుకున్నారు. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఒక కూతురిగా నేను గర్వపడుతున్నాను. ఆయన ప్రయాణం నేను చూసిన కష్టతరమైన వాటిలో ఒకటి. పని పట్ల మక్కువ, నిజాయితీ ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది నాన్నా" అని రాసుకొచ్చింది.
ఇకపోతే 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకలో ఉత్తమ నటిగా నిత్యా మేనన్ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'కార్తికేయ 2' ఎంపికైనందుకు గానూ డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు.