నేను అలా అనలేదు... హీరో వివరణ
ఆ విమర్శలపై తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా సినీ వేడుకలో రిషబ్ శెట్టి స్పందించారు.
కన్నడ హీరో రిషబ్ శెట్టి 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డం దక్కించుకున్నారు. కాంతార సినిమాకు ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందిస్తున్న రిషబ్ శెట్టి కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అంతర్జాతీయ సినిమా వేదికల మీద ఇండియా పరువు తీసే విధంగా బాలీవుడ్ వ్యవహరిస్తుంది అంటూ రిషబ్ శెట్టి వ్యాఖ్యలు చేశాడు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ఆయన్ను తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఆ విమర్శలపై తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా సినీ వేడుకలో రిషబ్ శెట్టి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ చెప్పుకొచ్చారు.
ఐఫా 2024 అవార్డు వేడుకల్లో పాల్గొన్న రిషబ్ శెట్టిని చుట్టుముట్టిన మీడియా గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ అడిగారు. ఆ సమయంలో రిషబ్ శెట్టి స్పందిస్తూ... నా మాటలను మీడియా వారు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నా కామెంట్స్ ను పూర్తిగా మార్చి ట్విస్ట్ చేసి ప్రచారం చేస్తున్నారు. నా ఉద్దేశ్యం ఒకటి అయితే మరో రకంగా సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై తప్పకుండా క్లారిటీ ఇస్తాను అన్నారు. ఆ విషయం గురించి మాట్లాడిన సమయంలో అన్ని విషయాలను వెళ్లడిస్తానంటూ రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని అన్నారు.
ఇంతకు రిషబ్ శెట్టి ఆగస్టు లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాండంటే... కొన్ని భారతీయ సినిమాల్లో, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో ఇండియాను తక్కువ చేసి చూపిస్తున్నారు. మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో చూస్తున్నప్పుడు అలా చూపించడం ఏమాత్రం పద్దతి కాదు. కనుక నేను దేశం గౌరవం పెరిగే విధంగా, దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించే విధంగా సినిమాలు తీయాలి అనుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ వేదికలపై ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు కనుక దేశం గురించి తప్పుగా చూపించవద్దు అన్నట్లుగా ఆయన విజ్ఞప్తి చేసినట్లు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు అదే రిషబ్ శెట్టి తాను బాలీవుడ్ సినిమాలను, ఇండియన్ సినిమాలను, ఫిల్మ్ మేకర్స్ ను కించ పరిచే విధంగా మాట్లాడలేదు అంటున్నారు. తన వ్యాఖ్యలను పూర్తిగా ట్విస్ట్ చేశారు అంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలు క్లీయర్ గా ఉన్నాయి, వాటిని ట్విస్ట్ చేసేది ఏముంది అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో త్వరలోనే మీడియా ముందుకు వస్తాను అన్నారు. కనుక ఆ మీడియా సమావేశంలో రిషబ్ శెట్టి ఏం చెబుతారు అనేది అందరికీ ఆసక్తిగా ఉంది.