'జై హనుమాన్' హీరోగా ఆ దర్శకుడు.. పర్ఫెక్ట్ కాంబో?

ఇది నిజమైతే, జై హనుమాన్ సినిమాకి మరింత క్రేజ్ వచ్చినట్లే. రిషబ్ తన నటనతో ప్రాధాన్యత కలిగిన పాత్రలకు కొత్తదనం తెస్తాడని అందరికీ తెలుసు.

Update: 2024-10-17 16:05 GMT

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో తేజ సజ్జ కథానాయకుడిగా నటించి మంచి మార్కులు కొట్టాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ హిట్‌గా నిలిచి, వందల కోట్ల కలెక్షన్లు సాధించి నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని ప్రాంతాల్లో ప్రశంసలు పొందింది.

 

ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా జై హనుమాన్ అనే చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి 2025లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. కానీ, ఈ సినిమాలో హీరోగా నటించబోయే వ్యక్తి ఎవరన్న దానిపై తాజాగా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. కాంతార చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన రిషబ్ శెట్టి జై హనుమాన్ లో ప్రధాన పాత్ర పోషించనున్నారని టాక్.

డైరెక్టర్ గానే కాకుండా, నటుడిగానూ తన సత్తా చాటిన రిషబ్ శెట్టి ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం ఎంచుకోబడ్డారని తెలుస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తే సినిమాకు ఓ ప్రత్యేకమైన హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్‌తో బిజీగా ఉన్న రిషబ్ కు హీరోగా కూడా అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి, ఇక ప్రశాంత్ వర్మ అడగ్గానే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇది నిజమైతే, జై హనుమాన్ సినిమాకి మరింత క్రేజ్ వచ్చినట్లే. రిషబ్ తన నటనతో ప్రాధాన్యత కలిగిన పాత్రలకు కొత్తదనం తెస్తాడని అందరికీ తెలుసు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రిషబ్ హీరోగా నటిస్తే, అది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాకుండా, మొత్తం భారతీయ ప్రేక్షకులను అలరించే ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. రిషబ్ శెట్టి పేరు కేవలం దక్షిణాది సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా, కాంతార సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు.

ఇక ఈ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించే అవకాశం ఉంది. తెలుగు పరిశ్రమలో ఈ సంస్థకు ఉన్న స్ధాయి, మార్కెట్ వలన ఈ ప్రాజెక్ట్ మరింత భారీగానే ఉండనుంది. గతంలో కేజీఎఫ్ వంటి ప్రాజెక్టులు పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల వసూళ్లు సాధించిన విధంగా, జై హనుమాన్ కూడా అలాంటి ఘన విజయాన్ని అందుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ ఎంతవరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది.

Tags:    

Similar News