ఈరోజు నా కల సాకారం అయ్యింది : తేజ్
ఈ రోజు నేను ఎప్పటికి మరచిపోలేను ఈ రోజు నా కల సాకారం అయిన రోజు
సాయి ధరమ్ తేజ్ తన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'బ్రో' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో సాయి ధరమ్ తేజ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. మెగా ఫ్యామిలీ కి చెందిన చాలా మంది హీరోలు చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి అవకాశం తేజ్ కు దక్కింది.
పవన్ కళ్యాణ్ తో ఒక ఫుల్ లెంగ్త్ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కు నటించే అవకాశం వచ్చిన రోజే తన సంతోషానికి అవధులు లేవు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. నేడు సినిమా విడుదల సందర్భంగా ట్విట్టర్ లో తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో క్యూట్ తేజ్ ను పవన్ తన కాళ్ల మధ్య పెట్టుకుని ఉండి కన్నుల విందు చేస్తోంది.
ఇక ట్విట్టర్ లో తేజ్... ఈ రోజు నేను ఎప్పటికి మరచిపోలేను, ఈ రోజు నా కల సాకారం అయిన రోజు. ఈ రోజును నేను జీవితాంతం ఒక జ్ఞాపకంగా గుర్తుంచుకుంటాను. నా గురువు సమానుడైన మామయ్య తో స్క్రీన్ పంచుకోవడంను ఎప్పటికి మరచిపోలేను. నాకు స్ఫూర్తిగా నిలిచి, ఎన్నో సార్లు మార్గ నిర్ధేశం చేసిన మామయ్య తో ఇంకా చిన్న పిల్లాడి మాదిరిగా చే పట్టుకుని నడుస్తున్నట్లుగా అనిపించింది.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ పాత్రకు నన్ను నమ్మి ఎంపిక చేసినందుకు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. నా కల సాకారం అవ్వడంలో మీరు కీలక పాత్ర పోషించారు. ఎప్పటికి నేను కృతజ్ఞుడిగా ఉంటాను. ఈ సినిమా ను చేస్తున్న సమయంలో మేము ఎంతగా అయితే ఆనందించామో సినిమా చూస్తున్న సమయంలో మీరు కూడా అంతే ఆనందం పొందుతారు అని విశ్వసిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా లో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో కనిపించింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబో సన్నివేశాలు అభిమానులకు కన్నుల విందు అన్నట్లుగా సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది. సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ కు మరపురాని చిత్రంగా నిలువబోతుంది.