సైఫ్ అలీఖాన్‌పై ఎటాక్‌లో మిస్టరీ?
అర్థరాత్రి 2.30 సమయంలో ఘటన జరిగినా చాలా సేపు వరకూ సైఫ్ ని ఆస్పత్రికి చేర్చలేకపోవడానికి కారణమేమిటి? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి కేసు మిస్టరీగా మారుతోంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు అంతకంతకు కొత్త విషయాలను రివీల్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. సైఫ్ ఖాన్ పై దాడి సమయంలో కేకలు వినిపించినా, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం, ఆ సమయంలో ఒకే ఒక్క పని మనిషి ఉండటం, అలాగే అతడిని ఆస్పత్రిలో చేర్చిన చాలా సేపటి వరకూ అతడి భార్య కుటుంబీకులు ఆస్పత్రికి చేరుకోలేకపోవడం వగైరా విషయాలపైనా చాలా చర్చ సాగుతోంది.
ఈ దాడికి ఇంట్లో ఏవైనా ఆస్తి తగాదాలేవైనా కారణమా? కేవలం దొంగతనం కోసం జరిగిన ఫైట్ మాత్రమే కత్తిదాడికి కారణమైందా? అర్థరాత్రి 2.30 సమయంలో ఘటన జరిగినా చాలా సేపు వరకూ సైఫ్ ని ఆస్పత్రికి చేర్చలేకపోవడానికి కారణమేమిటి? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మేరకు ప్రముఖ టీవీ చానెళ్లు కథనాలు వండి వార్చడం ఆశ్చర్యపరుస్తోంది.
వీటన్నిటినీ మించి దుండగుడు అసలు ప్రయివేట్ భద్రత మధ్య కట్టుదిట్టంగా ఉండే ఇంటి పహారాను దాటుకుని లోనికి ప్రవేశించడం చాలా సందేహాలను రేకెత్తిస్తోంది. అతడు చుట్టంలా వచ్చాడు .. కత్తితో హీరోపై దాడి చేసాడు. తిరిగి చుట్టంలాగే వెళ్లిపోయాడు. అంటే అతడికి సహకరించింది ఎవరు? అనే అనుమానాలు నెలకొన్నాయి. నిజానికి సైఫ్ ఖాన్ బాంద్రా అపార్ట్ మెంట్ 12వ అంతస్తులో ఉంది. అయినా దుండగుడు సులువుగా అక్కడికి చేరుకున్నాడు.
దీంతో ఆ ఇంట్లో పని చేస్తున్న ఓ ముగ్గురు పని మనుషుల వ్యవహారంపైనా పోలీసులు ఆరాలు తీస్తున్నారని సమాచారం. ఈ దాడి కేసులో చాలా కోణాల్లో పోలీసులు ఆరాలు తీస్తున్నాయి. ఇందులో ఆస్తి తగాదా ఏదైనా ఉందా? అనే యాంగిల్ కూడా టచ్ చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు.. ఈ కేసులో మిస్టరీని ఛేధించేందుకు మొత్తం ఏడు ఇన్వెస్టిగేషన్ టీమ్‌లను నియమించడం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
సైఫ్ ఖాన్ పై జరిగిన దాడిలో ఆరు కత్తిపోట్లు పడగా, అందులో ఒకటి వెన్నెముక పక్కనే ప్రమాదకరమైన కత్తిపోటు ఉందని కూడా వైద్యులు తెలిపారు. రెండు కత్తిపోట్లు లోతుగా చొచ్చుకుపోయాయి. ఒక చోట ఇనుప ముక్కను గుర్తించి సర్జరీ ద్వారా తొలగించారని తెలిసింది. అలాగే సైఫ్ ఖాన్ శరీరంలో లోతైన కత్తి పోట్లు ఉన్నచోట ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.