క‌త్తిపోట్లు పొడిచినా సెక్యూరిటీ అవ‌స‌రం లేద‌ట‌

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో దోపిడీ ప్ర‌య‌త్నం, అటుపై ప్ర‌తిఘ‌టించే క్ర‌మంలో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం గురించి తెలిసిందే.

Update: 2025-02-11 07:06 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో దోపిడీ ప్ర‌య‌త్నం, అటుపై ప్ర‌తిఘ‌టించే క్ర‌మంలో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం గురించి తెలిసిందే. సైఫ్ ఖాన్ శ‌రీరంలోకి ఆరు చోట్ల క‌త్తి పోట్లు దిగాయి. స‌కాలంలో వైద్య చికిత్స‌తో అత‌డు పూర్తిగా దీని నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే సైఫ్ ఖాన్ అంత పెద్ద స్టార్ త‌న సెక్యూరిటీ కోసం డ‌బ్బు చెల్లించ‌లేక‌పోతున్నాడా? ర‌క్ష‌ణ కోసం ర‌క్ష‌కుల‌ను ఎందుకు నియ‌మించుకోలేదు? అంటూ చాలా మంది ఇష్టానుసారం వ్యాఖ్యానించారు.

అత‌డి వ్య‌క్తిగ‌త అభిప్రాయం, ఆలోచ‌న‌ల‌తో ప‌ని లేకుండా ప‌లువురు సినీప్ర‌ముఖులు దీనిపై తోచిన విధంగా వ్యాఖ్యానించిన విష‌యం మీడియాలో హైలైట్ అయింది. క‌త్తి పోటు ఘ‌ట‌న అనంత‌రం ఆస్ప‌త్రిలో కోలుకుని, ఇంటికి చేరుకున్న సైఫ్ ఇటీవ‌ల జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అతని కుటుంబం అలెర్ట్ అయి.. ఇంటి వెలుపల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రక్షణ కోసం రోనిత్ రాయ్ భద్రతా సంస్థను నియమించుకుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ త‌న‌కు ఇవేవీ ఆస‌క్తి లేవ‌ని అన్నారు.

తాను భద్రతను నమ్మన‌ని అత‌డు వ్యాఖ్యానించ‌డం హాట్ టాపిగ్గా మారింది. ఢిల్లీ టైమ్స్‌తో ఇటీవల సైఫ్ అలీ ఖాన్ ఇలా అన్నాడు. ``నేను ఎప్పుడూ సెక్యూరాటీని నమ్మలేదు. ఎక్కువ భద్రత ఎందుకు లేదు? అని జ‌నం అడుగుతున్నారు. నేను ఎప్పుడూ భద్రతను నమ్మను. నాకు అది వద్దు`` అన్నాడు. జ‌రిగిన ఘ‌ట‌న‌ ఒక పీడకల లాంటిది. నాకు ఇప్ప‌టికీ సెక్యూరిటీ అవ‌స‌రం లేదు. ఎందుకంటే జ‌రిగిన దాడి నాపై దాడి అని నేను అనుకోను. నాకు కానీ మావాళ్ల‌కు కానీ ఎలాంటి బెదిరింపులు లేవు. ఆ ఘ‌ట‌న‌ పొరపాటున జ‌రిగిన‌ది మాత్ర‌మే`` అని సైఫ్ అన్నాడు.

అయితే దుండ‌గుడి దాడి త‌ర్వాత అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్లు నియ‌మించుకున్న రోనిత్ రాయ్ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ నుంచి సెక్యూరిటీని సైఫ్ ఏర్పాటు చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇవేవీ త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, ఆస‌క్తి లేద‌ని సైఫ్ చెబుతుండ‌డం విస్మ‌య‌ప‌రుస్తోంది. త‌న‌కు ఎవ‌రి నుంచి ఎలాంటి ముప్పు లేద‌ని, ముంబై సేఫ్ గా ఉంటుంద‌ని సైఫ్ అన్నాడు. ఎవరో దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు జ‌రిగిన పొర‌పాటు ఇది అని న‌మ్ముతున్న‌ట్టు సైఫ్ చెబుతున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు గాయాల నుండి బాగా కోలుకుంటున్నాడు . స్వేచ్ఛ‌గా బ‌య‌ట తిరుగుతున్నాడు. త‌న త‌దుప‌రి చిత్రం `ది జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్` ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News