రజనీకాంత్ సినిమా కారణంగా థియేటర్లు ఇవ్వడం లేదు!
ఇప్పుడు రజనీకాంత్ జైలర్ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించి.. తన సినిమాను తిరస్కరించారని సక్కీర్ ఆవేదన చెందుతున్నాడు
ఆగస్ట్ 10న జైలర్ vs జైలర్ రిలీజ్ ఎపిసోడ్ గురించి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ తో మలయాళ మినీ మూవీ 'జైలర్' కూడా థియేటర్లలో ఢీకొంటోంది. ఈ ఘర్షణ ఎవరూ ఊహించనిది. అయితే మలయాళ జైలర్ దర్శకనిర్మాత సక్కీర్ మదతిల్ సూపర్ స్టార్ రజనీ సినిమాతో పోటీకి దిగడం తమ సినిమాని ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ జైలర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఎక్కువ థియేటర్లు కేటాయించారని .. తన సినిమా అయోమయంలో పడిందని సక్కీర్ ఆవేదన వెలిబుచ్చారు. గత కొన్ని వారాలుగా రజనీకాంత్ 'జైలర్' సినిమాపై సక్కీర్ నిరసనలు వ్యక్తం చేస్తున్నాడు.
కేరళ థియేటర్లు తన సినిమాను తిరస్కరిస్తున్నాయని సక్కీర్ మదతిల్ చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా అతడు స్వయంగా నిర్మించారు. రిలీజ్ ముంగిట గొడవ వల్ల తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని సక్కీర్ చెప్పాడు.
సక్కీర్ మదాతిల్ 2021లో జైలర్ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసాడు. మలయాళంలో సినిమా టైటిల్‌ని మార్చమని రజనీకాంత్ జైలర్ ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్‌ని కూడా అభ్యర్థించాడు. అయితే అతని విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు రజనీకాంత్ జైలర్ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించి.. తన సినిమాను తిరస్కరించారని సక్కీర్ ఆవేదన చెందుతున్నాడు. కేరళలో తన సినిమాకు మరిన్ని స్క్రీన్లు అవసరమని నిరసనలు చేస్తున్నాడు. తమిళ సినిమాల వల్ల మలయాళ సినిమాలు నాశనమవుతున్నాయని కూడా అతడు ఆవేదనను కనబరిచాడు.
సినిమా వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సక్కీర్ మదతిల్ మాట్లాడుతూ.. తన ఇల్లు, కుమార్తె నగలను తనఖా పెట్టి ఈ ప్రాజెక్ట్‌పై రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. రజనీకాంత్ సినిమా తర్వాత తన సినిమా విడుదలైతే పనికి రాదని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడంతో విధిలేక తన సినిమాను కూడా విడుదల చేయవలసి వచ్చిందని ఆయన అన్నారు.
రజనీకాంత్- నెల్సన్ దిలీప్‌కుమార్‌ల 'జైలర్' తో పోటీపడుతూ తన 'జైలర్'ని విడుదల చేయవలసి వచ్చిందని సక్కీర్ తెలిపాడు. తమ సమస్యను పరిశీలించాల్సిందిగా కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సక్కీర్ మదతిల్ విజ్ఞప్తి చేశారు.