సలార్ సాబ్ కూడా సిద్ధం

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’ పై అప్డేట్ ఇచ్చారు.

Update: 2024-10-23 19:30 GMT

ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సలార్ 1 మాస్ ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. అయితే రెండవ పార్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు గట్టిగానే వచ్చాయి. మొదట సింగిల్ పార్ట్ గా ప్రకటించినా, తర్వాత రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. సలార్ మొదటి భాగం విజయం సాధించడంతో, సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి.

అయితే, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’ పై అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈ కొత్త షెడ్యూల్ లో పాల్గొని, చిత్రీకరణ ఫినిష్ చేయనున్నారట. ఈ షెడ్యూల్ మొత్తం 20 రోజులపాటు కొనసాగనుందని తెలుస్తోంది. సెకండ్ పార్ట్ స్టోరీ ‘ఖాన్సార్’ అనే కల్పిత నగరంలో సాగేలా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు.

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మరింత అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. అలాగే, సలార్ సెకండ్ పార్ట్ లో శ్రుతి హాసన్ కథానాయిక పాత్ర మరింత ఆసక్తికరంగా ఉంటుందట. ఈ భారీ బడ్జెట్ సినిమాని ‘హోంబలే ఫిల్మ్స్’ నిర్మిస్తుండటం, మరింత వైభవాన్ని పెంచుతోంది.

ప్రశాంత్ నీల్ ఒక సందర్భంలో సలార్ పార్ట్ 2 పూర్తిగా యాక్షన్ సీన్స్ పై ఆధారపడి ఉంటుందని, డ్రామా పరంగా ఈ పార్ట్ కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పారు. మొదటి పార్ట్ కి పనిచేసిన సాంకేతిక బృందం అందరూ ఈ సెకండ్ పార్ట్ లోనూ పనిచేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, స్టంట్స్ తో సలార్ పార్ట్ 2 మిగతా చిత్రాలతో పోల్చితే మరింత కొత్తగా ఉండబోతుంది.

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలకు ఉన్న క్రేజ్ తో సలార్ సెకండ్ పార్ట్ కూడా భారీ విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకంతో యూనిట్ ఉంది. మొదటి భాగం ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో, అదే స్థాయిలో సెకండ్ పార్ట్ ఇంకా బెటర్ అనుభూతిని ఇస్తుందని మేకర్స్ పేర్కొంటున్నారు. సలార్ పార్ట్ 2ని వీలైనంత వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలనే ప్లాన్ తో యూనిట్ ముందుకెళ్తోంది. సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags:    

Similar News