టెన్షన్ టెన్షన్.. స్టార్ హీరో చుట్టూ ఊపిరాడనివ్వని భద్రత..
బాబా సిద్ధిక్ హత్యలో లారెన్స్ ప్రమేయం ఉందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి
ఎన్‌సిపి సీనియర్ నాయకుడు బాబా సిద్ధిక్ నిర్దాక్షిణ్యంగా హత్యకు గురయ్యాక ముంబై గడగడలాడుతోంది. దావూద్ ఇబ్రహీం తర్వాత ఒకడు ముంబైని ఏలడానికి వచ్చాడని అంతా మాట్లాడుకుంటున్నారు. ఏ నోట విన్నా లారెన్స్ బిష్ణోయ్ అతడి గ్యాంగ్ గురించిన చర్చ మాత్రమే వినబడుతోంది. నాయకుడి హత్య వినాశకరమైనది మాత్రమే కాదు.. సెలబ్రిటీల్లో గుబులు పెంచుతోంది. తాజా కథనాల ప్రకారం.. ప్రఖ్యాత పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (సిద్ధు మూసేవాలా హత్య, బెదిరింపులు, సల్మాన్ ఖాన్‌పై దాడులలో ప్రధాన నిందితుడు) బాబా సిద్ధిక్ హత్యకు కారకుడని ప్రాథమిక నిర్ధారణ జరిగింది.
బాబా సిద్ధిక్ హత్యలో లారెన్స్ ప్రమేయం ఉందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. అంతేకాదు సల్మాన్ ఖాన్, అతడి కుటుంబ సభ్యులలో ఈ ఘటన తీవ్ర ఆందోళనను పెంచింది. ఇప్పుడు ఆ కుటుంబ భద్రత పెద్ద సమస్యగా మారింది. సలామ్ ఖాన్ తెల్లవారుజామున 3 గంటలకు బాబా సిద్ధిక్ కుటుంబాన్ని సందర్శించిన తరువాత అతడి భద్రతను అమాంతం పెంచారు. ప్రస్తుత టెన్షన్ వాతావరణం నడుమ.. తగు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ సిద్ధిక్‌ను సందర్శించి వెళుతున్నప్పుడు చాలా అసౌకర్యంగా కనిపించాడు. అటువంటి పరిస్థితిలో బాధగా కనిపించడం సాధారణమే అయినప్పటికీ.. సల్మాన్ చుట్టూ వేరే టెన్షన్ ఉంది. మరోవైపు సల్మాన్‌ఖాన్ ఇంటి చుట్టూ భద్రతను కూడా పెంచారు.
లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ లిస్టులో సల్మాన్ ఖాన్ చాలా కాలంగా ఉన్నాడు. జూన్ 4న సల్మాన్ ఖాన్ తనపైనా, తన కుటుంబంపైనా కాల్పులతో బెదిరింపుల తర్వాత ముంబై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. నన్ను నా కుటుంబ సభ్యులను నిదురిస్తున్న సమయంలో చంపాలని గుర్తు తెలియని దుండగులు ప్లాన్ చేసారని సల్మాన్ వాంగ్మూలంలో చెప్పారు.
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కూడా ఈ సంఘటన గురించి మాట్లాడుతూ... సలీం ఖాన్ కుటుంబం నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై కాల్పులు జరిపిన సంఘటన చాలా కలవరపెట్టింది. ఈ షాకింగ్ ఘటనతో మా కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దురదృష్టవశాత్తూ మా కుటుంబానికి సన్నిహితులమని చెప్పుకుంటూ, అధికార ప్రతినిధిగా నటిస్తూ కొందరు మీడియాకు అదంతా పబ్లిసిటీ స్టంట్ అని విశృంఖల ప్రకటనలు చేస్తున్నారు. ఇది నిజం కాదు. ఈ అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించకూడదు.. అని అన్నారు. ఇప్పుడు నేరుగా సల్మాన్ స్నేహితుడినే టార్గెట్ చేసి బిష్ణోయ్ గ్యాంగ్ అంతమొందించింది. దీంతో లారెన్స్ బిష్ణోయ్ ఎటాక్స్ విషయంలో సల్మాన్ కుటుంబం ఎంతగా టెన్షన్ పడుతోందో అర్థం చేసుకోవచ్చు.