అగ్ర హీరో క్రేజ్ అంతకంతకు..!
బాలీవుడ్ అగ్ర హీరోలు షారూఖ్ - సల్మాన్- అమీర్ ఖాన్ తమ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఇటీవల చాలా తంటాలు పడుతున్నారు.;
బాలీవుడ్ అగ్ర హీరోలు షారూఖ్ - సల్మాన్- అమీర్ ఖాన్ తమ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఇటీవల చాలా తంటాలు పడుతున్నారు. సినిమాలు వరుసగా ఫ్లాపులవుతున్నాయి. కింగ్ ఖాన్ షారూఖ్ వరుస బ్లాక్ బస్టర్లతో ట్రాక్ లోకి వచ్చినా కానీ, మిగిలిన ఇద్దరు ఖాన్ లు కెరీర్ ని దారికి తేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
సంవత్సరాలుగా వరుస ఫ్లాపులతో డీలాపడ్డ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం `సికందర్` చిత్రంతో భారీ విజయం అందుకోవాలని ఆశిస్తున్నాడు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. దీనికోసం అతడు సౌత్ ప్రతిభపై ఆధారపడ్డాడు. మురుగదాస్ లాంటి సౌత్ దర్శకుడిని నమ్ముకుని, దక్షిణాదికే చెందిన లక్కీ ఛామ్ రష్మికను తన కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు. సికందర్ ఈద్ కానుకగా విడుదల కానుంది.
అయితే ఈ సినిమా ప్రచార మెటీరియల్ కు ఆశించిన బజ్ రావడం లేదు. సల్మాన్-రష్మిక జంటపై ఫరాఖాన్ కొరియోగ్రాఫ్ చేసిన జోహ్రా జబీన్ (మొదటి) పాట విడుదలైనా కానీ, ఇది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను చేరలేదు.
ఈ పాట 24 గంటల్లో 28 మిలియన్ల వీక్షణలను పొందింది. ఆరంభం బావున్నా కానీ తరువాతి 48 గంటల్లో కేవలం ఒక మిలియన్ వీక్షణలు మాత్రమే దక్కాయి. చివరికి 30 మిలియన్లు.. అంటే 3 కోట్ల వీక్షణలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీనిని బట్టి సల్మాన్ ఖాన్ క్రేజ్ అంతగా పని చేయలేదా? అన్న సందేహాలొస్తున్నాయి. పాట ఊపు రాత్రికి రాత్రే తగ్గిపోయింది. విజువల్ గ్రాండియారిటీ ఉన్నా, కొరియోగ్రఫీ బావున్నా రొటీన్ గా ఉందన్న భావన ఉంది. రష్మిక అందంగా కనిపించినా ఎందుకనో ఈ పాటకు ఆదరణ కొరవడింది.
సల్మాన్ గత హిట్ సాంగ్స్ తో పోలిస్తే ఇది తక్కువ బజ్ తో సరిపెట్టుకుంది. ఏదైనా పాట ఇన్ స్టంట్ హిట్ కొట్టకపోతే ఈరోజుల్లో కష్టం. ప్రేక్షకులు సంగీతం, కొరియోగ్రఫీ పరంగాను కొత్తదనం ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టు కొత్త ప్రమాణాలు సెట్ చేయాల్సి ఉంటుంది. మొదటి పాట ఫెయిలైంది గనుక రెండో పాటతో కంబ్యాక్ కావాల్సి ఉంది. సికందర్ ఈద్ రేసులో భారీ ఓపెనింగులు తేవడానికి పాజిటివ్ బజ్ చాలా ముఖ్యం.