'సికందర్' టీజర్ టాక్.. మురుగదాస్ మార్క్ ఎక్కడ?
నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో సికిందర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సత్యరాజ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.
నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాజిద్ నడియాద్వాలా రూ.400 కోట్లతో నిర్మిస్తున్న సికిందర్ మూవీ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు గాను మేకర్స్ ప్రమోషన్స్ కొద్ది రోజుల క్రితం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకోగా రీసెంట్ గా టీజర్ కూడా తీసుకొచ్చారు.
'నానమ్మ సికిందర్ అని పేరు పెట్టింది. తాత సంజయ్ అని పేరు పెట్టాడు. ప్రజలు మాత్రం రాజాసాబ్ అని పేరు పెట్టారు' అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన టీజర్.. అందరినీ ఆకట్టుకుంది. కానీ అంచనాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయిందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మురుగదాస్ మార్క్ కనిపించలేదని చెబుతున్నారు.
ఎందుకంటే మురుగదాస్ రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఆయన తీసిన సినిమా అంటే అంతా భారీ అంచనాలు పెట్టుకుంటారు. కానీ కొంతకాలంగా ఆయన ప్రాజెక్టులు వర్కౌట్ అవ్వడం లేదు. ఇప్పుడు సికిందర్ పైనే మురుగుదాస్ ఆశలు పెటుకున్నారు. కానీ టీజర్ లో మాత్రం ఆయన మార్క్ లేదని అంటున్నారు.
డైలాగ్స్, ఫైట్స్ బాగున్నాయని, ఒక కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ మాత్రమే వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. కాన్సెప్ట్ కనపడటం లేదని చెబుతున్నారు. ఆయన సినిమాల టీజర్, ట్రైలర్ లో పక్కాగా కాన్సెప్ట్ క్లియర్ గా తెలుస్తుందని.. కానీ ఇప్పుడు అలా లేదని అంటున్నారు. ఆయన సినిమానేనా అనిపిస్తుందని చెబుతున్నారు.
అదే సమయంలో టీజర్ లో సౌత్ ముద్ర ఎక్కువగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. దానికి వెనుక కారణాలు ఏవైనా మురుగదాస్ టేకింగ్ లో చేంజ్ ఉందని అంటున్నారు. కాబట్టి ట్రైలర్ తో అయినా ఓ రేంజ్ లో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. మరి ట్రైలర్ ఎప్పుడు వస్తుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.