హీరోయిన్ల కష్టానికి తగ్గ పారితోషికం ఇవ్వడం లేదు
సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్లు ఇస్తారనే విషయం తెలిసిందే.;

సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్లు ఇస్తారనే విషయం తెలిసిందే. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్లు ఎవరికీ ఇవ్వరు. హీరో తర్వాత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది హీరోయినే అయినప్పటికీ వారిద్దరి మధ్య తేడా చాలా ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ గొంతు విప్పినప్పటికీ ఎవరూ ఆ అంశాన్ని పట్టించుకున్నది లేదు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సైతం ఈ విషయంపై గతంలో పలుమార్లు మాట్లాడింది. ఇప్పుడు తాజాగా సమంత మరోసారి రెమ్యూనరేషన్ల విషయంపై స్పందించింది. హీరో హీరోయిన్లు ఇద్దరూ సమానంగా కష్టపడుతున్నప్పుడు హీరోలకు అంత ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్లు ఇచ్చి, హీరోయిన్లకు ఎందుకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారో తనకు అర్థం కాదని సమంత అసహనం వ్యక్తం చేసింది.
ఇండస్ట్రీలో తనను ఇబ్బంది పెట్టే విషయాల్లో రెమ్యూనరేషన్ కూడా ఒకటని, అందుకే ఈ విషయంలో మార్పు తీసుకురావాలని ట్రై చేస్తున్నట్టు సమంత తెలిపింది. గతాన్ని తాను మార్చలేకపోయినప్పటికీ, ఇక మీదట మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని, అందుకే తన బ్యానర్ లో తాను నిర్మించే సినిమాల్లో నటించే వారికి సమాన పారితోషికాలు ఇస్తున్నట్టు సమంత వెల్లడించింది.
అలా అని ఆడ, మగ అందరికీ సమానంగా రెమ్యూనరేషన్లు ఇవ్వాలని తాను పోరాడుతున్నట్టు కాదని, ఒక పాత్ర కోసం ఆర్టిస్ట్ పడే కష్టాన్ని చూసి వారికి పారితోషికాన్ని నిర్ణయించాలని మాత్రమే తాను ఆరాటపడుతున్నాట్టు సమంత చెప్పుకొచ్చింది. నా శ్రమ చూసి మేము మీకు ఇంత ఇవ్వాలనుకుంటున్నామని దర్శకనిర్మాతలే చెప్పాలి కానీ నాకు ఇంత కావాలని తాను అడగాల్సిన అవసరం లేదని సమంత తెలిపింది.
ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ పెట్టి అందులో సమంత సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసిన సమంత, ఆ సినిమా కోసం పని చేసిన వారందరికీ ఆడ, మగ అని చూడకుండా ఒకేలా రెమ్యూనరేషన్లు ఇచ్చినట్టు డైరెక్టర్ నందినీ రెడ్డి తెలిపారు.