ఏ మాయ చేసావె.. ఇప్పటికీ ప్రతీ షాట్ గుర్తుంది: సమంత
తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరితో నటించింది.;
ఏ మాయ చేసావె సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన సమంత రూత్ ప్రభు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ తో పాటూ గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. దీంతో అమ్మడికి వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా వరుస మూవీ ఆఫర్లు వచ్చాయి. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరితో నటించింది.
కెరీర్ మధ్యలో కొన్ని వ్యక్తిగత ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాల నుంచి కొంత కాలం పాటూ గ్యాప్ తీసుకున్న సమంత మళ్లీ రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి తనదైన యాక్షన్ తో అదరగొట్టింది. అయితే సమంత నటించిన ఫస్ట్ మూవీ ఏ మాయ చేసావె రిలీజై అప్పుడే 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా రోజుల్ని గుర్తు చేసుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావె సినిమాలో నాగ చైతన్య, సమంత జంటగా నటించారు. అద్భుతమైన లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ, సమంత కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు.
ఈ ఇంటర్వ్యూలో ఏ మాయ చేసావె గురించి, తన కెరీర్ గురించి సమంత పలు విషయాలను తెలిపింది. అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అవుతుంది. 15 ఏళ్లు అనేది చాలా ఎక్కువ టైమ్ అని, కెరీర్ స్టార్టింగ్ లో తను చేసిన సినిమాలను ఇప్పుడు చూస్తే ఇంత చెత్తగా నటించానా అనిపిస్తుందని, కానీ వాటి నుంచే ఎన్నో నేర్చుకున్నానని, కెరీర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీలో తనకెవరూ తెలిసిన వారు లేరని, భాష కూడా రాదని, అప్పుడు తనకన్నీ కొత్తేనని సమంత వెల్లడించింది.
కెరీర్ కొత్తల్లో గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా కష్టంగా, ఇబ్బందిగా అనిపించేదని, కానీ తర్వాత ఆ పాత్రల్లో జీవించడం నేర్చుకున్నానని, ఇప్పుడు మళ్లీ ఆ సీన్స్ చూస్తుంటే నవ్వొస్తుందని చెప్పిన సమంత, తన ఫస్ట్ మూవీ మాస్కో కావేరి తన ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ తో కలిసి చేశానని, కానీ ఆ సినిమా ఒక రోజు షూటింగ్ తర్వాత ఆగిపోయి, ముందు ఏ మాయ చేసావె వచ్చిందని తెలిపింది.
ఏ మాయ చేసావె సినిమాకు సంబంధించి తనకు ప్రతీ విషయం, ప్రతీ షాట్ గుర్తుందని, కార్తిక్ ను గేట్ దగ్గర కలిసే సీనే తన ఫస్ట్ షాట్ అని, గౌతమ్ మీనన్ ఆ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆయనతో పని చేయడం మంచి అనుభూతినిచ్చిందని తెలిపిన సమంత, ఈ 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశానని, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా ఉన్నానని, రానున్న 15 ఏళ్ల కోసం మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు సమంత చెప్పుకొచ్చింది.