OTTలో అత్యధిక పారితోషికం అందుకున్న నటి?
ఓటీటీ రంగంలో స్టార్లు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఓటీటీ రంగంలో స్టార్లు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పెద్దతెరతో పోలిస్తే ఓటీటీలో ప్రయోగాలు తమకు కలిసొస్తున్నాయి. నటన పరంగా వైవిధ్యం చూపించేందుకు, నిరూపించుకునేందుకు ఇక్కడ ఆస్కారం ఎక్కువ. ఓటీటీల ద్వారా రీచ్ కూడా ఎక్కువ. ప్రపంచ దేశాల్లో ఇండియన్ డయాస్పోరాలో తారలకు పాపులారిటీ పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది కథానాయికలు ఓటీటీ మార్గంలో ప్రయాణించడానికి కారణమిదే.
ఇప్పటికే అగ్ర కథానాయికలంతా ఓటీటీల్లో నటిస్తున్నారు. `ఫ్యామిలీమ్యాన్ 2` సిరీస్ తో సమంత ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు `సిటాడెల్: హనీ బన్నీ`తో మరోసారి నిరూపించుకుంది. అంతేకాదు.. ఓటీటీలో అత్యధిక పారితోషికం తీసుకున్న దక్షిణాది కథానాయికగా సమంత పేరు వినిపిస్తోంది. తమన్నా, కీర్తి సురేష్, త్రిష సహా చాలా మంది అగ్రకథానాయికలు ఓటీటీల్లో నటించారు. కానీ సమంత అందరినీ డామినేట్ చేస్తోంది.
తాజాగా ఫిలింఫేర్ కవర్ స్టోరిలో సమంత ఘనతను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఫిలింఫేర్ కథనం సారాంశం ఇలా ఉంది. ``మయోసైటిస్ నిర్ధారణ అనంతరం ఆరోగ్యం పరంగా కోలుకోవడానికి ఒక సంవత్సరం విరామం తీసుకున్న తర్వాత సమంత రూత్ ప్రభు తిరిగి గతంలో కంటే పెద్ద స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకున్నారు. `సిటాడెల్: హనీ బన్నీ` ఇండియన్ ఎడిషన్‌లో యాక్షన్ క్వీన్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. హనీ అనే టైటిల్ పాత్రలో పాత్ర స్వభావానికి అనుగుణంగా నట వైవిధ్యం ప్రదర్శిస్తూ.. సులభంగా విన్యాసాలు చేసారు. హనీ బన్నీలో తన పాత్ర కోసం OTTలో అత్యధిక పారితోషికం పొందిన నటిగా రికార్డులకెక్కారు. ఈ పాత్ర కోసం 10 కోట్లు సంపాదించింది సామ్. పురుషాధిక్యత ఉన్న చోట ఇది సాధించుకుంది`` అని ఫిలింఫేర్ కథనంలో పేర్కొంది. అసాధారణ మహిళగా నిరూపించేందుకు సమంత చాలా కష్టాలను ఎదుర్కొందని ధైర్యమైన మహిళ అని కీర్తించింది. 65 వసంతాల ఫిలింఫేర్ ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి ప్రత్యేక ఇంటర్వ్యూలను అందిస్తున్నామని ఫిలింఫేర్ పేర్కొంది. ఫిలింఫేర్ కవర్ పేజీపై సమంత ఆకర్షణీయమైన ఫోటోషూట్ వెబ్ లో వైరల్ గా మారుతోంది.