సంపత్ నంది.. ట్విస్టులే ట్విస్టులు

ఈ చిత్రానికి దర్శకుడు కాదు కానీ.. క్రియేటర్‌గా అన్నీ తానై వ్యవహరించబోతున్నాడు సంపత్.

Update: 2024-03-02 04:00 GMT

దర్శకుడు సంపత్ నంది తన కెరీర్లో ఇప్పటిదాకా తీసింది ఐదు సినిమాలే. ఐతే ఆయన కెరీర్ ఎప్పటికప్పుడు ఎవ్వరూ ఊహించని మలుపులు తిరుగుతూనే ఉంది. ‘ఏమైంది ఈ వేళ’ లాంటి ప్రేమకథ’తో దర్శకుడిగా పరిచయమై.. ఏకంగా రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్‌‌తో ‘రచ్చ’ అనే మాస్ మూవీ తీయడం సంతప్‌కే చెల్లింది. ఆ సినిమా మంచి హిట్టవడంతో ఏకంగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తోనే సినిమా చేసే అవకాశం లభించింది. దాని కోసం అతను రెండేళ్లకు పైగా కష్టపడ్డాడు. కానీ అవకాశం దక్కినట్లే దక్కి చేజారింది. ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ అతడి చేతుల్లోంచి వెళ్లిపోయింది. రవితేజతో ‘బెంగాల్ టైగర్’ తీశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత కెరీర్లో గ్యాప్ వస్తూనే ఉంది కానీ ప్రతిసారీ మంచి బడ్జెట్లలో ఏదో క్రేజీ ప్రాజెక్టే చేస్తున్నాడు సంపత్. అలా వచ్చినవే గౌతమ్ నంద, సీటీమార్. ఈ చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. మధ్యలో సంపత్ నిర్మాతగా మారి ‘గాలి పటం’ అనే న్యూ ఏఝ్ లవ్ స్టోరీ తీశాడు. ‘ఓదెల రైల్వే స్టేషన్ అనే వెబ్ ఫిలిం తీశాడు. ఇవేవీ ఆశించిన ఫలితాలు అందుకోలేదు. అయినా సంపత్ ఆగలేదు. మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ హీరోగా ‘గాంజా శంకర్’ అనే మాస్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈసారి అతను కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈ సినిమాకు అనుకోకుండా బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. బడ్జెట్ సమస్యలు, ఇంకేవో కారణాలతో ఈ సినిమా ముందుకు కదలట్లేదు. వాట్ నెక్స్ట్ అని అందరూ ఎదురు చూస్తుంటే.. అందరికీ పెద్ద షాకిస్తూ ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్ రెడీ చేస్తున్నాడు సంపత్. ఆహాలో రిలీజైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాంటి సినిమాకు సీక్వెల్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. పార్ట్-1లో హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తే.. పార్ట్-2లో తనతో ఇప్పటికే మూడు సినిమాలు చేసిన తమన్నాను లీడ్ రోల్‌కు తీసుకున్నాడు సంపత్. ఈ చిత్రానికి దర్శకుడు కాదు కానీ.. క్రియేటర్‌గా అన్నీ తానై వ్యవహరించబోతున్నాడు సంపత్. దీంతో ‘గాంజా శంకర్’ సంగతి ఏమవుతుందన్నదే అర్థం కావడం లేదు.

Tags:    

Similar News