స్వయంభు సంయుక్త.. ఇలాంటి లుక్ ఊహించలేదు

భారీ బడ్జెట్‌తో, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం యుద్ధ నేపథ్యంతో ఉంటుందట.

Update: 2024-09-11 12:57 GMT

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న "స్వయంభూ" చిత్రంలో సంయుక్త ఊహించని లుక్ లో కనిపించబోతోంది. ఈ సినిమా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతుండగా, హీరో నిఖిల్ సిద్ధార్థ్ కు 20వ సినిమా కావడం విశేషం. ఇక సంయుక్త పాత్ర బలమైన వారియర్ గా ధైర్యంగా కనిపిస్తుండటంతో ఒక్కసారిగా ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకుముందు ఆమె ఇలాంటి పాత్రల్లో కనిపించలేదు.


సినిమా యూనిట్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఇందులో అమ్మడు అద్భుతమైన యోధురాలిగా విల్లు, బాణాలతో సన్నద్ధంగా కనిపిస్తోంది. పోస్టర్‌లో ఆమె గంభీరమైన లుక్, వెనుక రంగంలో వేరే యుద్ధ దృశ్యాలు హైలెట్ అవుతున్నాయి. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా సమ్యుక్త, నభా నటేష్ కథానాయికలుగా కనిపించనున్నారు.

భారీ బడ్జెట్‌తో, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం యుద్ధ నేపథ్యంతో ఉంటుందట. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌లో భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ స్వయంభూకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, కె కె సెంథిల్ కుమార్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్, తన గత సినిమా కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విజయాన్ని తన కెరీర్‌లో మరో మెట్టుగా చేసుకుంటూ, వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇక పీరియాడిక్ యాక్షన్ డ్రామా "స్వయంభు"తో కూడా మరో బిగ్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ ఒక లెజెండరీ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు, ఇది సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతోంది.

సినిమా పోస్టర్లు, మేకింగ్ వీడియోలు ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. గతంలో విడుదల చేసిన నిఖిల్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. పూర్తిగా యుద్ధానికి సిద్దమై ఉండే యోధుడిగా కనిపిస్తున్న ఆ పోస్టర్ లో అతని సరికొత్త లుక్‌ను హైలైట్ చేసింది. గతంలో కంటే విభిన్నంగా, తన నటనలో వైవిధ్యం చూపించబోతున్నాడని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. ఇక ఇప్పుడు సంయుక్త పోస్టర్ కూడా ఆ అంచనాల స్థాయిని పెంచుతోంది.

ప్రస్తుతం మేకర్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రీకరణ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీన్‌ కోసం ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్‌తో కలిసి పని చేస్తున్నారు. ఇక సినిమాలో ఒక ప్రధాన యాక్షన్ సీన్‌కు రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆ మధ్య టాక్ వచ్చింది. దీన్ని బట్టి మొత్తం సినిమా బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే. నిఖిల్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కత్తి సాము, కర్ర సాము, గుర్రపు స్వారీ వంటి యుద్ధ విద్యలను నేర్చుకోవడం విశేషం.

Tags:    

Similar News