కోలీవుడ్‌లో వేధింపులు త‌క్కువేమీ కాదన్న న‌టి

మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో లైంగిక వేధింపుల దాష్ఠీకంపై జస్టిస్ హేమ క‌మిటీ నివేదిక సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-21 08:03 GMT

మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో లైంగిక వేధింపుల దాష్ఠీకంపై జస్టిస్ హేమ క‌మిటీ నివేదిక సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీలో మ‌హిళా న‌టీమ‌ణులకు ర‌క్ష‌ణ లేద‌ని ఈ క‌మిటీ నిర్ధారించింది. వేధించిన వారి గురించి ఓపెనైతే ప్రాణ‌భ‌యం కూడా ఉంటుంద‌ని క‌మిటీ వెల్ల‌డించ‌డంతో ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. మ‌హిళ‌ల‌కు అందాల్సిన క‌నీస సౌక‌ర్యాలు కూడా సెట్స్ లో అందుబాటులో ఉండ‌వ‌ని హేమ క‌మిటీ నివేదించింది.

దీనికి కొన‌సాగింపుగా ఇప్పుడు ఇత‌ర సినీప‌రిశ్ర‌మ‌లోను స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ప‌లువురు న‌టీమ‌ణులు త‌మ ప‌రిస్థితిపైనా ఓపెన‌వుతున్నారు. తమిళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని తమిళ నటి సనమ్ శెట్టి తాజాగా పేర్కొన్నారు. కేరళకు చెందిన హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి మాట్లాడుతూ స‌న‌మ్ శెట్టి షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం వెలుపల నటి స‌న‌మ్ మీడియాతో మాట్లాడారు. కోల్‌కతా అత్యాచారం, హత్య కేసు తర్వాత మహిళలపై జరుగుతున్న నేరాలను ఖండిస్తూ ర్యాలీకి అనుమతి కోరేందుకు ఆమె వేదిక వద్దకు వచ్చారు.

హిందుస్థాన్ టైమ్స్ తమిళ్ ప్రచుర‌ణ ప్రకారం... హేమా కమిటీ నివేదిక గురించి మీడియా ప్ర‌శ్నించ‌గా.. సనమ్ చెన్నైలో తన ర్యాలీకి సంబంధించిన ప్రణాళికలను చర్చించారు. ఆమె ప్ర‌కారం.. ``కేవ‌లం మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లోనే కాదు, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. హేమ కమిటీ నివేదిక వివరాలు నాకు తెలియవు. కానీ నేను ఈ చర్యను స్వాగతిస్తున్నాను. ఇలాంటి నివేదికను అందించినందుకు న్యాయ‌మూర్తి హేమకు , కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తమిళ సినీ ప్రపంచంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కానీ ఎవరూ బ‌య‌ట‌కు చెప్పలేరు. నేను నా స్వీయానుభవం నుండి మాట్లాడుతున్నాను``అని చెప్పారు. సంఘటన జరిగినప్పుడు బాధితురాలు దాని గురించి ఎందుకు ఓపెన్ కాలేర‌ని కొంద‌రు క్రాస్ క్వశ్చన్ చేస్తారని సనమ్ అన్నారు. అలాంటి ప్రశ్న అడిగితే తనకు కోపం వస్తుందని.. నేను నిన్ను చెప్పుతో కొడతాను అని ఫోన్ కట్ చేసిన సంద‌ర్భాలున్నాయ‌ని కూడా తెలిపారు.

అడ్జస్ట్‌మెంట్ ఉంటేనే అవకాశం పొందాలంటే.. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా నేను నా గొంతు వినిపిస్తాను. అలాగ‌ని సినిమా ఇండస్ట్రీలో అందరూ ఇలా ఉండరు. స్త్రీలే కాదు.. పురుషులు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటారు. ఎవ‌రైనా న‌టీమ‌ణిని అడ్జస్ట్ మెంట్ గురించి అడిగితే అక్క‌డి నుంచి ఉమ్మివేసి బయటికి వెళ్లండి. మ‌న‌కు ఇలాంటి సినిమా వద్దు.. మీపై మీకు నమ్మకం ఉంటే అవకాశాలు వస్తాయి! అని స‌న‌మ్ చెప్పారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత దాడులు, వేధింపుల గురించి హేమ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమ నేతృత్వంలోని ప్రముఖ నటి శారద, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కెబి వల్సల కుమారి త‌దిత‌రుల క‌మిటీ నివేదిక‌ను రెడీ చేసింది. క‌థానాయిక‌పై నటుడు దిలీప్‌ దాడి కేసు తర్వాత 2017లో హేమ కమిషన్ ఏర్పాటు అయింది. క‌మిటీ నివేదిక పరిశ్రమలోని భయంకరమైన పరిస్థితులను బహిర్గతం చేసింది.

Tags:    

Similar News