బ్లాక్ బుకింగ్ స్కామ్‌పై ఓపెనైన టాప్ డైరెక్ట‌ర్

ఈరోజుల్లో ఇలాంటి టెక్నిక్ ని ఫాలో అవ్వ‌ని థియేట‌ర్ లేదంటే అతిశయోక్తి లేదు. దీనిపై ఇప్పుడు పెద్ద డిబేట్ కి తెర తీసాడు ప్ర‌ముఖ బాలీవుడ్ క్రిటిక్ కోమ‌ల్ న‌హ‌తా. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

Update: 2025-02-17 07:38 GMT

టికెట్ బుక్ చేయ‌డానికి బుక్ మై షో లేదా వేరే ఏదైనా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ని ఆశ్ర‌యించ‌గానే, ముందుగా ముఖ్య‌మైన సీట్లు అన్నీ బ్లాక్ అయిన‌ట్టు చూపిస్తుంది. అవ‌న్నీ ప్రేక్ష‌కులు జెన్యూన్ గా బుక్ చేసిన‌వి కాదు. వాటిని ఏవో కార్పొరెట్ కంపెనీలు బుక్ చేసుకున్నాయి అని ప్ర‌జ‌ల్ని భ్ర‌మింప‌జేయ‌డం. ఈరోజుల్లో ఇలాంటి టెక్నిక్ ని ఫాలో అవ్వ‌ని థియేట‌ర్ లేదంటే అతిశయోక్తి లేదు. దీనిపై ఇప్పుడు పెద్ద డిబేట్ కి తెర తీసాడు ప్ర‌ముఖ బాలీవుడ్ క్రిటిక్ కోమ‌ల్ న‌హ‌తా. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

అక్షయ్ కుమార్ నటించిన `స్కై ఫోర్స్` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందినా ఆశించిన స్థాయి బాక్సాఫీస్ వ‌సూళ్లను సాధించ‌డంలో త‌డ‌బడింది. ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించడంతో చిత్ర‌యూనిట్ కొంత‌మేర ఊపిరి పీల్చుకుంది. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత అక్ష‌య్‌కి కొంత ఉప‌శ‌మ‌నం ఇచ్చిన సినిమా ఇది. అయితే అక్ష‌య్ లాంటి పెద్ద స్టార్ నుంచి ఇంకా భారీ వ‌సూళ్ల‌ను ఇండ‌స్ట్రీ ఆశిస్తోంది. సీనియర్ జర్నలిస్ట్, ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహ్తా ఈ చిత్రం బాక్సాఫీస్ నంబ‌ర్ల‌ను తారుమారు చేయడానికి నిర్మాతలు బుకింగ్‌లను బ్లాక్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. విక్కీ కౌశల్ , రష్మిక మందన్న నటించిన `చావా`పై కూడా ఆయన ఈ ఆరోపణలు చేశారు. రెండు చిత్రాలను మాడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సంస్థ కోమ‌ల్ ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా స్కై ఫోర్స్ డైరెక్టర్ సందీప్ కెవ్లానీ జాతీయ మీడియాతో మాట్లాడారు. థియేటర్లలో సినిమా న‌డిచేప్పుడు అస‌లు క‌లెక్ష‌న్ల వివ‌రాలు చెప్ప‌డం ఆపేయాల‌ని అత‌డు పిలుపునిచ్చారు. కోమల్ నహ్తా గొప్ప సీనియర్ జర్నలిస్ట్ .. నేను అతడిని చాలా గౌరవిస్తాన‌ని, ఈ విషయంపై ఆయన మాట్లాడాల్సి వస్తే, ప్రజల ముందు ఆయన ఎవరి పేర్లు చెప్పకూడదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక సినిమాను కించపరచడం ద్వారా ఏదైనా లాభం పొందుతారని నేను అనుకోను. గత 5 సంవత్సరాలలో బ్లాక్ బుకింగ్ (బల్క్ టికెట్ బుకింగ్) లేదా కార్పొరేట్ బుకింగ్‌లు చేసినట్లు అతను భావిస్తే, అలా చేసిన‌ ప్రతి సినిమా పేరును రికార్డెడ్ గా అతడు చెప్పాల్సి ఉంటుంది.. అని వ్యాఖ్యానించారు.

చావా లేదా స్కై ఫోర్స్ కలెక్షన్లు నిజాయితీగా వెల్ల‌డించామ‌ని .. బ్లాక్ బుకింగ్‌లు జరగలేదని సందీప్ అన్నారు. ఇది ప్రేక్షకుల ప్రేమతో సాధించిన విజ‌యం. స్కై ఫోర్స్ విడుదలై దాదాపు 20 రోజులు అయింది. ఇప్ప‌టికీ సినిమా న‌చ్చిన ప్రేక్ష‌కులు ట్విట్ట‌ర్, ఇన్‌స్టాలో మెసేజ్ లు పంపిస్తున్నారు. సినిమా తెర‌కెక్కించి ప్రజలకు చేరవేశాక‌ మా పని పూర్త‌యిన‌ట్టే. ఒక సినిమా ఎంత వసూళ్లు చేస్తుందనేది జ‌నం ప‌ట్టించుకోరు. అంద‌రికీ ఇష్టమైన చిత్రం మున్నా భాయ్ బాక్సాఫీస్ కలెక్షన్ గురించి నేను అడిగితే మీరు చెప్ప‌గ‌ల‌రా? దీర్ఘకాలంలో సినిమా కలెక్షన్ ల‌ను ప‌ట్టించుకోరు.. అది ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఎంత కాలం ఉంది అన్న‌దే ముఖ్యం! అని అన్నారు. అంతేకాదు.. సినిమా కలెక్షన్ల గురించి ప్రజలకు చెప్పకూడదని ద‌ర్శ‌క‌ర‌చ‌యిత సందీప్ అన్నారు. క‌లెక్ష‌న్లు అనేది కేవలం 15 రోజులు లేదా ఒక నెల ఆట. ఆపై అందరూ వాటి గురించి మర్చిపోతారు. కలెక్షన్ల కోసం ఒక వ్యవస్థ ఉండకూడదు. ఒక సినిమా ఎంత సంపాదించిందో మనం ప్రజలకు ఎందుకు చెప్పాలి? ఒక‌ సినిమా ఎక్కువ బిజినెస్ చేస్తేనే అది మంచిదని మనం చెప్పాలా? కలెక్షన్లతో సినిమాకు సంబంధం లేదు. ప్రేక్షకులు సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకోనివ్వండి. క‌లెక్ష‌న్ల గురించి చెప్ప‌డం, ట్రేడ్ నిపుణులు ప్రారంభించిన చాలా భిన్నమైన పద్ధతి. కానీ అది మంచి సినిమా అయితే ప్ర‌జ‌లు ఎలాగైనా చూస్తారు. ఒక సినిమా రూ. 300 కోట్లు సంపాదించినా మీకు నచ్చకపోతే అది ఆర్జించిన డ‌బ్బును చూసి మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకోరు క‌దా! అని అన్నారు.

ఒక‌వేళ సినిమా కలెక్షన్ గురించి ప్రజలకు తెలియజేయాలనుకుంటే అది థియేటర్లలో రన్ పూర్తయిన తర్వాత చెప్పండి. ప్రస్తుతం గంటకోసారి నివేదికలు వస్తున్నాయి. ఇది కూరగాయల మార్కెట్ లా మారింది. విమర్శకులుగా భావించే ఈ ట్రేడ్ వ్యక్తులు, యూట్యూబర్లు 2 గంటలకోసారి బాక్సాఫీస్ వివ‌రాల్ని అందిస్తున్నారు.

ఇది షేర్ మార్కెట్టా? నేను ఇవ‌న్నీ చూసి నవ్వుకుంటాను! అని అన్నారు. ప్రేక్ష‌కులు ఇలాంటి వివ‌రాలు ప‌ట్టించుకోరు. న‌చ్చిన సినిమాకి వెళ‌తార‌ని సందీప్ అన్నారు. ట్రైల‌ర్ న‌చ్చింద‌నో లేదా సినిమా బావుంద‌ని ప‌క్కింటి వాళ్లు చెబితేనో జ‌నం థియేట‌ర్ల‌కు వెళుతున్నార‌ని సందీప్ వివరించాడు.

బ్లాక్ బుకింగ్ అంటే ఏమిటి? .. ఒక నిర్మాణ సంస్థ లేదా ఎగ్జిబిట‌ర్ తమ చిత్రానికి బ‌ల్క్ టిక్కెట్లు కొనుగోలు చేసే పద్ధతి. అందువల్ల బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో టిక్కెట్లు త్వరగా అమ్ముడవుతున్నట్లు కనిపిస్తాయి. ఇది సినిమాపై సానుకూల‌త‌ను పెంచుతుంది..ప్రేక్షకుల మనస్సులో ఈ సినిమాకి డిమాండ్ ఉంద‌నే భ్రమను సృష్టిస్తుంది. ఇలాంటి చెత్త‌ లాజిక్ ని ఉప‌యోగించ‌ని థియేట‌ర్లు నేడు లేనే లేవు!!!!

Tags:    

Similar News