పుష్ప లాంటిది నాతో చేయ‌వా.. సందీప్ వంగాను కోరిన‌ సూప‌ర్‌స్టార్

టాలీవుడ్ నుంచి బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్, పుష్ప చిత్రాలు భార‌తీయ సినిమాపై చూపించిన ప్ర‌భావం ఎలాంటిదో తెలిసిన‌దే.

Update: 2024-09-30 04:05 GMT

టాలీవుడ్ నుంచి బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్, పుష్ప చిత్రాలు భార‌తీయ సినిమాపై చూపించిన ప్ర‌భావం ఎలాంటిదో తెలిసిన‌దే. ఈ సినిమాల స్ఫూర్తితో చాలామంది ఫిలింమేక‌ర్స్ పాన్ ఇండియా మార్కెట్లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరారు. ఇందులో చాలామంది ప్ర‌య‌త్నించి విఫ‌లం కాగా, రేర్ గా బాలీవుడ్ నుంచి షారూఖ్ లాంటి స్టార్ హీరో స‌క్సెస్ చూపించ‌గ‌లిగాడు. ప‌ఠాన్, జ‌వాన్ లాంటి పాన్ ఇండియా ప్ర‌య‌త్నాల‌తో అత‌డు 1000 కోట్ల క్ల‌బ్ లు అందుకున్నాడు. యానిమ‌ల్ చిత్రంతో ర‌ణ‌బీర్ కి ఇది సాధ్య‌మైంది. కానీ హిందీ, త‌మిళంలో చాలామంది చేసిన ప్ర‌య‌త్నాలేవీ స‌క్సెస్ కాలేదు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప` చిత్రం పాన్ ఇండియాలో సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే గాక‌, అతడి పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోయేలా చేసింది. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ప్ర‌భావం చూపించిన దిగ్గ‌జ హీరోలెవ‌రికీ రానంత క్రేజ్ అల్లు అర్జున్ కి వచ్చింది. ఈ సినిమాతో అత‌డు ఉత్త‌మ‌న‌టుడిగా జాతీయ అవార్డును అందుకోవ‌డం, 90ఏళ్లు పైబ‌డిన టాలీవుడ్ హిస్ట‌రీలో జాతీయ అవార్డ్ అందుకున్న తొలి హీరోగా రికార్డుకెక్క‌డం తెలిసిన‌వే.

`పుష్ప` చిత్రంలో పుష్ప‌రాజ్ పాత్ర దిగ్గ‌జ న‌టుల‌ను గొప్ప‌గా ప్ర‌భావితం చేసింది. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ సైతం పుష్ప‌రాజ్ పాత్ర‌కు ఎంత‌గానో ఫిదా అయిపోయారు. అత‌డిని ఎంత‌గా ప్ర‌భావితం చేసింది? అంటే.. నేరుగా ప‌బ్లిక్ వేదిక‌పై నాకోసం `పుష్ప` లాంటి సినిమా చేయవా? అని ఒక ద‌ర్శ‌కుడిని లైవ్ లోనే అడిగేంత‌గా.. అత‌డు ప్ర‌భావితం అయ్యాడు.

అల్లు అర్జున్ నటించిన `పుష్ప: ది రైజ్` మాదిరిగానే తనకు సౌత్ మూవీ కావాలని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను షారూఖ్ అభ్యర్థించారు. 2021లో విడుదలైన పుష్ప‌ చిత్రం భారీ విజయాన్ని అందుకోవ‌డ‌మే గాక‌, క్రిటిక‌ల్ గాను ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ `పుష్ప 2 ది రూల్` ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న తిరిగి త‌మ పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా, పుష్ప‌రాజ్ గా అల్లు అర్జున్ మ‌రోసారి స‌త్తా చాట‌నున్నారు.

క‌బీర్ సింగ్, యానిమల్ (2023) లాంటి వ‌రుస చిత్రాల‌తో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన సందీప్ రెడ్డి వంగా పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. అలాంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడితో ప‌ని చేయాల‌నుంద‌ని షారూఖ్ నేరుగా అత‌డినే అడిగేశారు. బ‌హుశా యానిమ‌ల్ 2 కంటే ముందే అత‌డు షారూఖ్ ఖాన్ తో సినిమా ప్లాన్ చేస్తాడ‌ని కూడా అంతా భావిస్తున్నారు.

Tags:    

Similar News