ఆడిష‌న్ లో అది దొర‌క‌డ‌మే గొప్ప‌!

న‌టీన‌టులను ఎవ‌రైనా స‌రే ఓ సినిమాలోకి తీసుకోవాలంటే వారిని ఆడిషన్ చేయ‌డం కామ‌న్.;

Update: 2025-04-14 06:51 GMT
ఆడిష‌న్ లో అది దొర‌క‌డ‌మే గొప్ప‌!

న‌టీన‌టులను ఎవ‌రైనా స‌రే ఓ సినిమాలోకి తీసుకోవాలంటే వారిని ఆడిషన్ చేయ‌డం కామ‌న్. డైరెక్ట‌ర్ రాసుకున్న పాత్ర‌లో స‌ద‌రు న‌టీన‌టులు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు? ఆ పాత్ర ఎవ‌రికి అప్ప‌చెప్తే బాగా చేయ‌గ‌ల‌రు అనే విష‌యాలు ఆడిష‌న్ చేస్తేనే తెలుస్తోంది. హీరోలు, హీరోయిన్లు, కీల‌క న‌టీన‌టుల‌కు కూడా చాలా సంద‌ర్భాల్లో ఆడిష‌న్ ఉంటుంది.

ఎంతోమంది డైరెక్ట‌ర్లు ఇప్ప‌టికీ ఆ విధానాన్నే ఫాలో అవుతూ ఉంటారు. స్టార్ హీరోల‌కు సైతం కొన్నిసార్లు ఆడిష‌న్స్ త‌ప్ప‌వు. ఆడిష‌న్ చేయ‌డం వ‌ల్ల స‌ద‌రు యాక్ట‌ర్ మీద‌ ముందే డైరెక్ట‌ర్ కు ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. అయితే ఆడిష‌న్స్ ఇవ్వ‌డ‌మంటే మాట‌లు కాదు. అక్కడ ఎంతోమంది ఉంటారు. దానికి తోడు కొత్త వాళ్లైతే అక్క‌డ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆడిష‌న్ కు వెళ్లిన కొత్త‌వారికి అక్క‌డ క‌నీస సౌక‌ర్యాలు కూడా ఉండ‌వు. కూర్చోడానికి ఏమీ ఉండ‌దు, తాగ‌డానికి నీళ్లుండ‌వు, ఇలా చాలానే ఇబ్బందులుంటాయి. ఇదిలా ఉంటే సంగీత్ శోభ‌న్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆడిష‌న్స్ లో ఉండే ఇబ్బందుల్ని చెప్పాడు. తాను మ్యాడ్ సినిమాలో న‌టించిన‌ప్పుడు బాగా చేశావ‌న్నార‌ని, కానీ మ్యాడ్ స్వ్కేర్ సినిమా త‌ర్వాత త‌న‌ని స‌డెన్ గా నెపో కిడ్ అంటున్నార‌ని చెప్పాడు.

స‌డెన్ గా తాను నెపో కిడ్ ఎలా అయ్యానో అర్థం కావ‌డం లేద‌ని, నెపో కిడ్ అయినంత మాత్రాన తానేం ఈజీగా ఇండ‌స్ట్రీలోకి రాలేదని, తాను కూడా అంద‌రిలానే ఆడిషన్స్ ఇచ్చాన‌ని, కాక‌పోతే త‌న తండ్రి నిర్మాత అవ‌డం వ‌ల్ల ఆయ‌న పేరు చెప్తే కుర్చీ వేసి, వాట‌ర్ ఇచ్చేవార‌ని, ఆడిష‌న్ లో అది దొర‌క‌డమే చాలా అదృష్ట‌మ‌ని.. ఆడిషన్స్ అలానే జ‌రుగుతాయ‌ని సంగీత్ శోభ‌న్ చెప్పుకొచ్చాడు.

అలా అని ఎప్పుడూ త‌న తండ్రి పేరుని వాడుకోలేద‌ని, తండ్రి పేరు వాడుకున్నా చివ‌రికి టాలెంట్ ఉంటేనే క‌దా అనుకుని ఎప్పుడూ ఆయ‌న పేరుని ఉపయోగించుకోలేద‌ని చెప్పాడు సంగీత్. త‌న తండ్రి నుంచి సినిమా వ‌చ్చింది ఎప్పుడో 2006లో. కానీ ఇప్పుడు తాను హీరో గా మారితే నెపోటిజం ఎలా అవుతుందో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని, ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్పుడు తన అన్న‌య్య సంతోష్ శోభ‌న్ కూడా ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాడ‌ని, అన్న‌తో పోలిస్తే త‌న క‌ష్టం కాస్త త‌క్కువేన‌ని సంగీత్ తెలిపాడు.

Tags:    

Similar News