సంక్రాంతి బాక్సాఫీస్.. ఇది కదా కావాల్సింది
యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు రాబడుతోంది.
పుష్ప 2 తరువాత తెలుగు బాక్సాఫీస్‌కి కొంత గ్యాప్ వచ్చినా, ఈ సంక్రాంతి బరిలో దిగిన మూడు పెద్ద సినిమాలు థియేటర్లకు తిరిగి ప్రాణం పోశాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ సినిమాలు ఈ పండుగ సీజన్‌లో ప్రేక్షకులను ఎక్కువగన్స్ ఆకర్షించాయి. మూడు సినిమాలు భిన్నమైన జానర్‌లలో ఉండటం, ప్రేక్షకుల ఆకలి తీర్చే ప్రయత్నం చేయడంలో కొంతమేర సక్సెస్ అయ్యాయి. డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకర్షిస్తోంది. బాలయ్య తన మాస్ ఫాలోయింగ్‌ను మరోసారి హై లెవెల్లో ఎలివేట్ చేశారు.
యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు రాబడుతోంది. మాస్ బెల్ట్స్‌లో ఈ సినిమా ఊపు ఎక్కువగా ఉండడం విశేషం. బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. వెంకటేష్ బ్రాండ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ వాతావరణానికి మంచి అనుకూలతను కలిగించింది.
ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే, మొదటి రోజు హైప్ బాగానే ఉండినా, టాక్ అనుకున్న స్థాయిలో రాలేదు. కానీ సినిమాకు ఉన్న భారీ థియేటర్ కౌంట్ కారణంగా ఆదాయం బాగానే ఉంది. మెల్లగా గేమ్ ఛేంజర్ థియేటర్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ నంబర్లను పక్కన పెట్టినా, ఈ సినిమాలు మూడు కూడా థియేటర్లలో ప్రేక్షకులను రప్పించడంలో విజయవంతమయ్యాయి.
థియేటర్ల ఆర్థిక లాభాలు కూడా ఈ మూడు సినిమాల విడుదలతో గణనీయంగా పెరిగాయి. ప్రతి టికెట్ విక్రయం వెనుక పార్కింగ్ ఆదాయం, క్యాంటీన్ ఆదాయం ప్రధాన పాత్ర పోషించాయి. ప్రత్యేకంగా, ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా వచ్చే సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్యాంటీన్ ఆదాయాన్ని మరింతగా పెంచింది. పిల్లలతో కుటుంబం మొత్తం సినిమా చూడటానికి రావడం వల్ల థియేటర్ ఇన్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ కొనుగోళ్లలో మరింత పెరుగుదల కనిపించింది.
ఇంకా, చిన్న థియేటర్లలో అదనపు ప్లాస్టిక్ కుర్చీలు, సోఫాల వంటి ఏర్పాట్లు కూడా మంచి ఆదాయాన్ని రాబట్టాయి. ఫుల్ హౌస్ కనిపించే థియేటర్లు సంక్రాంతి సీజన్ వాతావరణాన్ని మరింత రసవత్తరంగా మార్చాయి. తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలో ఇలాంటి సొల్యూషన్స్ మరింత లాభాలను అందించాయి. ఈ తరహాలో ప్రతీ మూడు నెలలకోసారి ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు.