వెంకీ మామ ఒక్క సినిమాతో అరడజను రికార్డ్‌లు!
లాంగ్ రన్‌లో రూ.300 కోట్ల వసూళ్లను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో వెంకటేష్ స్థానం గురించి ప్రశ్నించే వారికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చింది.
వెంకటేష్ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన సినిమాల బాక్సాఫీస్ వద్ద అంత వసూళ్లు సాధించాయి, ఇంత వసూళ్లు సాధించాయి అంటూ చెబుతూ ఉంటే వినడం తప్ప ఈ జనరేషన్ ప్రేక్షకులు ఆయన సూపర్ డూపర్ హిట్ సినిమాను, భారీ వసూళ్లను చూసిందే లేదు. కొన్నాళ్ల క్రితం ఎఫ్ 2 సినిమా వచ్చింది. ఆ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపు రూ.200 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. లాంగ్ రన్‌లో రూ.300 కోట్ల వసూళ్లను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో వెంకటేష్ స్థానం గురించి ప్రశ్నించే వారికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్‌లు నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా యూఎస్‌లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను క్రాస్ చేసింది. లాంగ్ రన్‌లో అక్కడ మరో మిలియన్ డాలర్లను వసూళ్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. బుక్ మై షో ద్వారా ఇప్పటికే దాదాపుగా 2.5 మిలియన్‌ల టికెట్లు అమ్ముడు పోయాయి. ఈ నెంబర్ ఎక్కడి వరకు చేరుతుందో తెలియడం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక వెంకటేష్ ఈ సినిమాతో చాలా రికార్డ్‌లను బ్రేక్ చేసి కొత్త రికార్డ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటి వరకు సీనియర్ హీరోల్లో రూ.100 కోట్ల షేర్ రాబట్టిన హీరోగా చిరంజీవి ఉన్నారు. ఆయన తర్వాత స్థానంను వెంకటేష్ దక్కించుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన హీరోగా చిరంజీవి మాత్రమే ఇన్నాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వెంకటేష్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసి రూ.300 కోట్ల వైపుకి దూసుకు పోతుంది. సీనియర్ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఉన్న హీరోగా వెంకటేష్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక సంక్రాంతికి వచ్చిన సీనియర్ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయబోతున్నాడు.
వందల కోట్ల వసూళ్లు రావడం ఈమధ్య కాలంలో కామన్‌గా చూస్తూ ఉన్నాం. అయితే ఎక్కువ శాతం లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు రూ.500 కోట్లు రాబట్టినా పెద్దగా లాభాలు వచ్చిన దాఖలాలు ఉండవు. కానీ వెంకటేష్ ఈ సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించడం ద్వారా లాభాల శాతం ఏకంగా 200 ఉండే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ దాదాపు ఐదు, పదేళ్లుగా థియేటర్ వైపు వెళ్లని వారిని సైతం ఈ సినిమా థియేటర్‌కి నడిపించింది. కనుక ఇది వెంకటేష్‌కి దక్కిన అరుదైన రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చాలా చాలా రికార్డ్‌లను ఇప్పటికే దక్కించుకున్నాడు, ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు ఆయన సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.