థమన్ సెంటిమెంట్.. ఈసారి వర్కౌట్ అవుద్దా?
రెండు చిత్రాలకు ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారనేది కీలకంగా మారుతుంది. టీజర్, ట్రైలర్ వరకూ బీజీఎం బాగానే ఉంది.
టాలీవుడ్ లో హీరోలకు ఉన్నట్లే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ కి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఆయన సంగీతం సమకూర్చిన సినిమాలు సంక్రాంతి పండక్కి వస్తే, ఖచ్చితంగా సక్సెస్ సాధించినట్లే అని సినీ అభిమానులు నమ్ముతారు. గతంలో అనేకసార్లు ఇది ప్రూవ్ అయింది కూడా. ఇప్పటి వరకూ తమన్ మ్యూజిక్ అందించిన 11 సినిమాలు పొంగల్ కి రిలీజైతే, వాటిల్లో 10 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఒక్క 'సూపర్ మచ్చి' మాత్రం ఫ్లాప్ అయింది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఈసారి కూడా అతని సంక్రాంతి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? అనే చర్చలు జరుగుతున్నాయి.
థమన్ కెరీర్ లో ఫస్ట్ సంక్రాంతి సినిమా 'మిరపకాయ్'. 2011లో హీరో రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి కమర్షియల్ హిట్టయింది. మరుసటి ఏడాది ఫెస్టివల్ సీజన్ లో ఆయన సంగీతం సమకూర్చిన 'బిజినెస్ మ్యాన్' (2012) మూవీ రిలీజ్ అయింది. మహేశ్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సాధించింది. అదే సంవత్సరం పండక్కి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన 'బాడీగార్డ్' సినిమా కూడా వచ్చింది. వెంకటేశ్, గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన ఈ చిత్రం హిట్టైంది.
రామ్ చరణ్, దర్శకుడు వి.వి వినాయక్ కలిసి చేసిన 'నాయక్' చిత్రం 2013 సంక్రాంతికి విడుదలైంది. దీనికి తమన్ మ్యూజిక్ అందించారు. ఇక 2016 పండుగ సీజన్ లో నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్' సినిమా వచ్చి విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత మళ్ళీ పొంగల్ బరిలో 'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం.. నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డులు క్రియేట్ చేసింది. థమన్ మ్యూజిక్ ఈ మూవీ సక్సెస్ లో ముఖ్య భూమిక పోషించింది.
కోవిడ్ పాండమిక్ సమయంలో 2021 సంక్రాంతికి విడుదలైన రవితేజ 'క్రాక్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తమన్ సంగీతం భూం బద్దల్ చేసింది. ఇక 2023 ఫెస్టివల్ సీజన్ లో తమన్ స్వరాలు సమకూర్చిన బాలయ్య 'వీర సింహా రెడ్డి' & విజయ్ 'వారసుడు' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రెండూ మంచి విజయం సాధించాయి. గతేడాది పండగకు మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీ వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టింది. ఇందులోని పాటలు ఏడాది కాలంగా కుర్చీని మడత పెడుతూనే ఉన్నాయి.
2025 పొంగల్ కి థమన్ మ్యూజిక్ అందించిన 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఒకటి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం. మరొకటి బాలయ్య, బాబీ కాంబోలో రూపొందుతోన్న సినిమా. రెండిటికీ థమన్ న్యాయం చేసే ప్రయత్నం చేశారు. గేమ్ ఛేంజర్ లో పాటలు వైరల్ అవ్వలేదు కానీ, ఫ్యాన్స్ కు మాత్రం బాగానే నచ్చాయి. మరోవైపు డాకు నుంచి వచ్చిన మూడు సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. రెండు చిత్రాలకు ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారనేది కీలకంగా మారుతుంది. టీజర్, ట్రైలర్ వరకూ బీజీఎం బాగానే ఉంది. మరి ఓవరాల్ సినిమాలో థమన్ వర్క్ ఎలా ఉంటుందో?, ఈసారి ఆయన సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా? అనేది చూడాలి.