సంతాన ప్రాప్తిరస్తు: 'జాక్ రెడ్డి'గా తరుణ్ భాస్కర్

విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.;

Update: 2025-03-01 07:10 GMT

విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, జీవన్ కుమార్, మురళిధర్ గౌడ్, శ్రీలక్ష్మి, హర్ష వర్ధన్, బిందు చంద్రమౌళి, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీలా, సద్దాం తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.


ఈ సినిమా నుంచి ఇప్పటికే వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, జీవన్ కుమార్ క్యారెక్టర్ పోస్టర్లు విడుదల కాగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ రోల్ రివీల్ చేశారు. పెల్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో 'జాక్ రెడ్డి' అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తన సూపర్బ్ టైమింగ్, విభిన్నమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించే తరుణ్, ఈ సినిమాకు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని అంటున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన క్యారెక్టర్ పోస్టర్లు సినిమాపై మంచి క్యూరియాసిటీ పెంచాయి. తాజాగా విడుదలైన తరుణ్ భాస్కర్ లుక్ పోస్టర్ సినిమాకు అంచనాలను మరింత పెంచింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన షేక్ దావూద్ జీ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఈ కథలో దంపతులు ఎదుర్కొనే పలు సమస్యలను ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి ABCD చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు, ఇటీవలే అహా నా పెళ్లంట వెబ్‌సిరీస్‌కి దర్శకత్వం వహించిన ఆయన, తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇందులోనూ చూపించనున్నారని టాక్.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల్ని అలరించేందుకు తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించిన వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి చివరి షెడ్యూల్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్‌ను పెంచగా, తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ రివీల్ ఆ హైప్‌ను మరింత పెంచింది.

Tags:    

Similar News