వితంతువు స్టోరీ.. ఆస్కార్స్ 2025 బ‌రిలో?

ఉత్త‌మ అంత‌ర్జాతీయ ఫీచ‌ర్ ఫిలిం కేట‌గిరీలో ఇది నామినేష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

Update: 2024-09-30 20:30 GMT

ఇటీవ‌ల భార‌త‌దేశం నుంచి ఆస్కార్ బ‌రిలో పోటీప‌డే చిత్రంగా కిరణ్ రావు 'లాప‌టా లేడీస్' చిత్రాన్ని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఉత్తమ విదేశీ చిత్రం కేట‌గిరీలో ఇది పోటీప‌డ‌నుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్రైమ్ మూవీ `సంతోష్` UK త‌ర‌పున ఆస్కార్స్ లో పోటీప‌డనుంద‌ని తెలిసింది. ఉత్త‌మ అంత‌ర్జాతీయ ఫీచ‌ర్ ఫిలిం కేట‌గిరీలో ఇది నామినేష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

ది హాలీవుడ్ రిపోర్టర్ క‌థ‌నం ప్రకారం.. యునైటెడ్ కింగ్‌డమ్ ఉత్తరప్రదేశ్ ఆధారిత క్రైమ్ డ్రామా సంతోష్ 2025 ఆస్కార్‌లకు `ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం` విభాగంలో అధికారికంగా ప్రవేశించ‌నుంది. సంధ్యా సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది భారతీయ పోలీసు క‌థ‌. క్రైమ్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కింది. సంతోష్ ఈ సంవత్సరం ప్రారంభంలో అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శిత‌మైంది. ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు వేడుక‌ల్లో చాలామంది దృష్టిని ఆకర్షించింది. అనంత‌రం ఉత్తర అమెరికా పంపిణీ హక్కులను మెట్రోగ్రాఫ్ పిక్చర్స్ వెంట‌నే కైవసం చేసుకుంది. 2018లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ షార్ట్‌గా ఎంపికైంది. సంధ్యా సూరి పాపుల‌ర్ నేమ్. 2019లో బాఫ్టా నామినేషన్‌ను పొందిన ఆమె ప్రశంసలు పొందిన డాక్యుమెంటరీ `ఐ ఫర్ ఇండియా` (2005)ను రూపొందించారు. అవార్డు గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ ది ఫీల్డ్ తర్వాత సంధ్యా సూరి మొదటి ఫీచర్ ఫిలింగా `సంతోష్` గుర్తింపు ద‌క్కించుకుంది.

సంతోష్ సినిమా గురించి:

ఈ చిత్రంలో షహానా గోస్వామి సంతోష్ అనే యువ హిందూ వితంతువుగా నటించారు. ఆమె తన దివంగత భర్త ప్రభుత్వ పథకం ద్వారా పోలీసు కానిస్టేబుల్‌గా వారసత్వ జాబ్ లో చేరుతుంది. పోలీస్ అవ్వ‌గానే సంస్థాగత అవినీతిలో చిక్కుకుపోతుంది. నిమ్న-కుల దళిత సమాజానికి చెందిన యుక్తవయసులోని బాలిక హత్యను పరిశోధించడానికి ఆమె అనుభవజ్ఞుడైన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శర్మతో క‌లిసి ప‌ని చేస్తుంది. ఈ క‌థ‌ను ఎమోష‌న‌ల్ గా తెర‌పై ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కురాలు.

UK మూడుసార్లు అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ కేటగిరీకి నామినేట్ అయింది. 2024లో జోనాథన్ గ్లేజర్ మూవీ `ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌`తో మొదటి ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం జాబితా ఏమిట‌న్న‌ది 17డిసెంబర్ 2024న ప్రకటిస్తారు. అధికారిక నామినేషన్లు 17 జనవరి 2025న వెల్ల‌డిస్తారు. 97వ అకాడమీ అవార్డుల వేడుక‌లు 2025 మార్చి 2న జరుగుతాయి.

Tags:    

Similar News