'సత్యం సుందరం' మూవీ రివ్యూ
సత్యం సుందరం. '96' ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ రూపొందించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
'సత్యం సుందరం' మూవీ రివ్యూ
నటీనటులు: కార్తి-అరవింద్ స్వామి-శ్రీ దివ్య-దేవదర్శిని-రాజ్ కిరణ్-జయప్రకాష్ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
ఛాయాగ్రహణం: మహేంద్రన్ జయరాజు
నిర్మాతలు: జ్యోతిక-సూర్య
రచన-దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుల్లో కార్తి ఒకడు. అతను.. అరవింద్ స్వామి ముఖ్య పాత్రలు పోషించిన కొత్త చిత్రం.. సత్యం సుందరం. '96' ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ రూపొందించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సత్యం (అరవింద్ స్వామి) గుంటూరు దగ్గర తాను ఉన్న ఊరిని యుక్త వయసులో వదిలి వెళ్లాల్సి వస్తుంది. దగ్గరి బంధువులే మోసం చేయడంతో అతడి కుటుంబం తమకెంతో ఇష్టమైన ఇంటిని కోల్పోతుంది. దీంతో ఆ ఊరిలో ఉండలేక వైజాగ్ వెళ్లిపోతుంది. ఆ బాధతో ఆ ఊరికి పూర్తిగా దూరమైన సత్యం.. తనకెంతో ఇష్టమైన చెల్లెలి పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తన సొంత ఊరికి తిరిగొస్తాడు. ఈ క్రమంలో అతడికి సుందరం (కార్తి)తో పరిచయం అవుతుంది. తనతో సాగే ప్రయాణంలో సత్యం ఎదుర్కొన్న అనుభవాలేంటి.. దీంతో అతడి జీవితంలో వచ్చిన మార్పేంటి.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
సినిమా అంటే ఇలాగే ఉండాలి.. కథను ఇలాగే చెప్పాలి.. తెరపై ఇదే చూపించాలి.. సన్నివేశాలు ఇలాగే తీయాలి.. అంటూ నిబంధనలేమీ లేవు. తెర మీద కనిపించేది చూసి ప్రేక్షకుడు అనుభూతి చెందడం అన్నింటికంటే ప్రధానం. ఊహకందని అద్భుతాలను తెర మీద కళ్లు చెదిరే రీతిలో ఆవిష్కరిస్తే చూసి అబ్బురపడే ప్రేక్షకులు.. మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలను అందంగా.. హృద్యంగా చూపించినా చూసి మైమరిచిపోతారు. కానీ ఈ రెండో కోవకు చెందిన కథలను రాయడానికి.. నరేట్ చేయడానికి గొప్ప అభిరుచి.. ప్రత్యేకమైన నైపుణ్యం ఉండాలి. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ సి.ప్రేమ్ కుమార్ '96'లో అలాంటి అభిరుచిని.. నైపుణ్యాన్నే చూపించాడు. కథగా చూస్తే '96' సగటు ప్రేమకథలా అనిపించినా.. బ్యూటిఫుల్ మూమెంట్స్ ను ఏర్చి కూర్చి.. ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చాడు ప్రేమ్ కుమార్. అప్పుడు ఓ అబ్బాయి-అమ్మాయి మధ్య స్వచ్ఛమైన ప్రేమ బంధాన్ని హృద్యంగా ఆవిష్కరించిన ప్రేమ్ కుమార్.. ఇప్పుడు చిన్నతనంలో విడిపోయి చాన్నాళ్ల తర్వాత కలిసి ఇద్దరు దూరపు బంధువుల మధ్య ఒక రోజు సాగే ప్రయాణాన్ని తనదైన శైలిలో అంతే హార్ట్ టచింగ్ గా తీర్చిదిద్దాడు. ఇందులోనూ పెద్దగా కథేమీ ఉండదు. కానీ ప్రేక్షకులను నవ్విస్తూ. కదిలిస్తూ '96' లాగే ఒక మంచి మొమెరీగా మిగులుతుంది 'సత్యం సుందరం'.
'సత్యం సుందరం' ఒక్క రోజులో అయిపోయే కథ. ఆ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాలంటే.. బంధువులు చేసిన మోసం వల్ల తన ఇంటిని కోల్పోయి వేరే ఊరికి వెళ్లిపోయిన వ్యక్తి ఓ పెళ్లి కోసం చాలా ఏళ్ల తర్వాత ఆ ఊరికి వెళ్లి.. ఆ పెళ్లి చూస్తాడు. చాన్నాళ్ల తర్వాత ఆ పెళ్లిలోనే కలిసిన ఓ వ్యక్తితో ఒక రాత్రి సాంగత్యం చేస్తాడు. ఆ చిన్న ప్రయాణంలో అవతలి వ్యక్తి ఇతడిలో ఏం మార్పు తెచ్చాడన్నదే ఈ కథాంశం. కార్తి లాంటి స్టార్ హీరోను పెట్టి ఇంత సింపుల్ కథతో సినిమా తీయడమే పెద్ద విశేషం. ఐతే ఎక్కడా కార్తి అనే హీరో కాకుండా.. సుందరం అనే నిష్మల్మషమైన ఒక సగటు పల్లెటూరి కుర్రాడు మాత్రమే తెరపై కనిపిస్తాడు. సినిమాలో సత్యం పాత్రకు అనిపించినట్లే.. తొలి పరిచయంలో చిరాగ్గా అనిపించి.. ఆ తర్వాత ఇతనేదో గమ్మత్తుగా ఉన్నాడే అనిపించి.. చివరికి మనిషి అంటే ఇతను.. బతికితే తనలా బతకాలి అనిపించే అద్భుతమైన పాత్ర కార్తిది. లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ పాత్ర ప్రవేశంతో 'సత్యం సుందరం' ఒక జాలీ-ఎమోషనల్ రైడ్ లాగా మారుతుంది. ఓవైపు నవ్విస్తూ.. అక్కడక్కడా కదిలిస్తూ.. మధ్య మధ్యలో ప్రేక్షకులను వెనుకటి రోజుల్లోకి తీసుకెళ్లి ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తూ అనేక అనుభూతులను పంచుతాడు ప్రేమ్ కుమార్.
కమల్ హాసన్ మైల్ స్టోన్ మూవీస్ లో ఒకటైన 'సత్యమే శివం' సినిమాతో 'సత్యం సుందరం'ను పోల్చవచ్చు. పేరులోనే కాక ప్రధాన పాత్రలు.. వాటి మధ్య ఒక జర్నీని చూపించడంలో కమల్ మూవీని ప్రేమ్ కుమార్ స్ఫూర్తిగా తీసుకున్నట్లున్నాడు. ఐతే ఇక్కడ కథ పరిధి చాలా చిన్నది. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేంత విషయం కూడా లేదు అందులో. అయినా సరే ప్రేక్షకులు కథ గురించి పెద్దగా పట్టించుకోరు. చాలా సింపుల్ గా అనిపిస్తూనే హార్ట్ టచింగ్ అనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను డ్రైవ్ చేస్తాయి. పెళ్లికూతురికి బహుమతిగా తీసుకొచ్చిన వస్తువులను స్టేజ్ మీదే ఆమెకు తొడిగే ఓ సన్నివేశం దర్శకుడిది ఎంత గొప్ప అభిరుచో చాటుతుంది. ముందు చిరాగ్గా మొదలయ్యే ఈ సన్నివేశం.. చివరికి ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించేంత హృద్యంగా మారుతుంది. ఇలాంటి ఎమోషనల్ మూమెంట్స్ మరి కొన్ని ప్రేక్షకులను కదిలిస్తాయి. కానీ ఎక్కడా మెలో డ్రామా పెరగకుండా.. సినిమా భారంగా మారకుండా.. లైటర్ వీన్లో సాగడం పెద్ద ప్లస్. ప్రథమార్ధంలో ఎక్కువగా సరదా సన్నివేశాలతోనే సాగే 'సత్యం సుందరం'.. ద్వితీయార్దంలో ఎక్కువగా భావోద్వేగాల మీద నడుస్తుంది. ఒక సైకిల్ తన జీవితంలో తెచ్చిన మార్పును గుర్తుంచుకుని అది తనకు దక్కడానికి కారణమైన వ్యక్తి మీద అమితమైన ప్రేమాభిమానాలు పెంచుకుని తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే కార్తి పాత్ర.. సంబంధిత సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. ఎక్కడా పనిగట్టుకుని సందేశాలు ఇవ్వడం.. క్లాసులు పీకడం లాంటిది చేయకున్నా.. మనం ఎలా బతుకుతున్నామో గుర్తు చేస్తూ.. ఎలా బతకాలో నేర్పించే ఒక పాఠంలా అనిపిస్తుంది 'సత్యం సుందరం'. అందరి జీవితాల్లో జరిగేవే అయినా.. మనం పెద్దగా పట్టించుకోని... ఆగి ఆలోచించని చిన్న చిన్న విషయాలనే ఇందులో చాలా హృద్యంగా చూపించి అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాడు ప్రేమ్ కుమార్. నరేషన్ స్లో అనేది ఒక కంప్లైంట్ లాగా చెప్పొచ్చు. కానీ ఈ కథను ఇలాగే చెబితేనే కరెక్ట్ అనిపిస్తుంది. కార్తి-అరవింద్ స్వామి కాంబినేషన్లో సినిమా అంటే కథ గురించి ఎక్కువ ఊహించుకోకుండా.. ఇందులోని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను ఆస్వాదించడానికి సిద్ధపడాలి. జ్ఞాపకాలను నెమరువేసుకోవడాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది.
నటీనటులు:
కార్తి ఎంత ప్రత్యేకమైన నటుడో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి ఒక పల్లెటూరి వ్యక్తిగా అతను ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్.. అలాగే డైలాగ్ డెలివరీ మార్చుకున్నాడు. కల్మషం లేని.. అమాయకత్వం ఉట్టిపడే సుందరం పాత్రను అతను ఎంత గొప్పగా చేశాడో మాటల్లో చెప్పడం కష్టం. ఈ పాత్ర థియేటర్ నుంచి వచ్చాక కూడా చాన్నాళ్ల పాటు వెంటాడుతుంది. కార్తి కెరీర్లోనే దీన్ని చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎంతో శ్రద్ధగా తెలుగులో అతను డైలాగులు చెప్పిన తీరు ముచ్చటగొలుపుతుంది. అరవింద్ స్వామి కూడా సత్యం పాత్రలో చాలా బాగా నటించాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలో అందుకు తగ్గట్లుగా కొలిచినట్లు నటించాడు అరవింద్. కార్తి-అరవింద్ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. గొప్పగా ఎమోషన్లను పండించారు. శ్రీదివ్య.. దేవ దర్శిని చిన్న చిన్న పాత్రల్లోనే చక్కగా నటించారు. రాజ్ కిరణ్.. జయప్రకాష్.. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు.
సాంకేతిక వర్గం:
'96'లో మాదిరే గోవింద్ వసంత మరోసారి హార్ట్ టచింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటల్లో మరీ చార్ట్ బస్టర్స్ లేవు కానీ.. సందర్భానుసారంగా.. ఆహ్లాదకరంగా.. హృద్యంగా సాగుతాయి. నేపథ్య సంగీతం కూడా మంచి ఫీల్ తో సాగింది. మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీలో అభిరుచి కనిపిస్తుంది. విజువల్స్ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్.. తన జీవిత అనుభవాల నుంచే కథలు రాసి వాటిని అందంగా తెరపై ప్రెజెంట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో కనిపించేవి అందరి జీవితాల్లో జరిగే.. జరుగుతున్న విషయాలే కానీ.. వాటిని ఇంత అందంగా.. హృద్యంగా తెరపై చూపించడం.. వాటి చుట్టూ ఇంత బాగా కథ అల్లడం.. ప్రేక్షకుల్లో భావోద్వేగం కలిగించడం చిన్న విషయం కాదు. కథ పలుచనగా అనిపించినా.. అది వేసే ఇంపాక్ట్ మాత్రం బలమైంది. రచయితగా.. దర్శకుడిగా ప్రేమ్ కుమార్ మరోసారి గొప్ప అభిరుచిని చూపించాడు.
చివరగా: సత్యం సుందరం.. భావోద్వేగాల జడివాన
రేటింగ్-3/5