సత్యం సుందరం.. మనోళ్లకు ఎక్కుతోందిగా!

బ్లాక్ బస్టర్ హిట్ 96 ఫేమ్ సీ ప్రేమ్ కుమార్.. దర్శకత్వం వహించిన ఆ మూవీ నిన్న తెలుగులో విడుదల అయింది.

Update: 2024-09-29 18:15 GMT

కోలీవుడ్ యాక్టర్స్ కార్తి, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ 96 ఫేమ్ సీ ప్రేమ్ కుమార్.. దర్శకత్వం వహించిన ఆ మూవీ నిన్న తెలుగులో విడుదల అయింది. 96 సినిమాతో సింపుల్ లవ్ స్టోరీని మనుసులను హత్తుకునేలా చూపించి సినీ ప్రియులను మెప్పించిన ప్రేమ్ కుమార్.. ఆరేళ్ల విరామం తర్వాత ఇప్పుడు భావోద్వేగభరిత చిత్రం సత్యం సుందరంతో మరోసారి అలరించారు.

కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో నటించడం.. హీరో సూర్య, జ్యోతిక దంపతులు ప్రొడ్యూస్ చేయడం.. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించడం.. వాటికి తోడు మూవీ టీజర్, ట్రైలర్ అలరించేలా ఉండటంతో సత్యం సుందరం సినిమాపై విడుదలకు ముందే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తమిళంలో రిలీజ్ అయిన ఒక్కరోజు తర్వాత టాలీవుడ్ లో విడుదలైన సత్యం సుందరం.. మంచి రెస్పాన్స్ అందుకుని తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది.

సోషల్ మీడియాలో కూడా మంచి రివ్యూస్ ఇస్తున్నారు సినీ ప్రియులు. స్క్రీన్ పై నిజ జీవిత కథను చూస్తున్నామా అన్నట్లు నేచురల్ యాక్టింగ్ తో క్యాస్టింగ్ అంతా మెప్పించారని చెబుతున్నారు. కార్తి, అరవింద్ స్వామి తమ భావోద్వేగ భరితమైన నటనతో కట్టిపడేశారని అంటున్నారు. చాలా జ్ఞాపకాలతోపాటు భావోద్వేగాలను నింపుకున్న ఓ అందమైన జీవిత ప్రయాణంలా సినిమా సాగిందని అంటున్నారు. ముఖ్యంగా మూవీ కాన్సెప్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అభిప్రాయపడుతున్నారు.

నవల లాంటి కథను అదే ఫీల్‌ తో అందమైన సినిమాగా తెరకెక్కించారని, దర్శకుడు ప్రేమ్‌కుమార్ తన టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారని చెబుతున్నారు. అయితే సత్యం సుందరం మూవీ తెలుగులో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు మార్నింగ్ అండ్ మ్యాటీ షోలు మంచి ఆక్యుపెన్సీ సంపాదించుకున్నాయి. సినిమాపై పాజిటివ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుండడంతో ఈవెనింగ్, నైట్ షోలకు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.

డబ్బింగ్ మూవీలా కాకుండా.. స్ట్రయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుండడంతో.. టాలీవుడ్ సినీ ప్రియులు సత్యం సుందరం సినిమాకు బాగా అట్రాక్ట్ అవుతున్నారని తెలుస్తోంది. కాబట్టి వీకెండ్ తో పాటు దసరా సెలవులు కూడా వస్తుండటంతో మూవీ మంచి వసూళ్లు సాధిస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ డేకు మించి సెకండ్ డే(ఆదివారం) కలెక్షన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి సత్యం సుందరం మూవీ.. తెలుగులో ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News