సీత‌మ్మ వాకిట్లో సీక్వెల్.. అస‌లు కుదిరే ప‌నేనా?

ఫ్యాన్స్ డిమాండ్ ఎక్కువవ‌డంతో దిల్ రాజు మొత్తానికి సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు రీరిలీజ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి మార్చి 7న రీరిలీజ్ చేస్తున్నారు.;

Update: 2025-03-06 05:55 GMT

వెంక‌టేష్, మ‌హేష్ బాబు క‌లిసి న‌టించిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాకు స‌ప‌రేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. 2013లో రిలీజై సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ సినిమాను రీరిలీజ్ చేయ‌మ‌ని ఎంతో కాలంగా ఫ్యాన్స్ అడుగుతున్న‌ప్ప‌టికీ దిల్ రాజు దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

ఫ్యాన్స్ డిమాండ్ ఎక్కువవ‌డంతో దిల్ రాజు మొత్తానికి సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు రీరిలీజ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి మార్చి 7న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూడాల‌ని కేవ‌లం వెంక‌టేష్, మ‌హేష్ బాబు ఫ్యాన్సే కాదు, స‌ద‌రు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృత‌గా ఉన్నారు. ఈ రీరిలీజ్ మూవీకి ఆల్రెడీ 10 థియేట‌ర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయంటే దాని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో దిల్ రాజు నిర్మించాడు. ఇప్పుడు ఈ మూవీ మార్చి 7న రీరిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చాడు. అందులో భాగంగా ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచ‌న రాలేదా అని దిల్ రాజును ఓ రిపోర్ట‌ర్ అడిగాడు.

దానికి స‌మాధానంగా దిల్ రాజు సినిమా చూశాక ఏ పాయింట్ తో సీక్వెల్ చేస్తే బావుంటుందో ఐడియా వ‌స్తే చెప్ప‌మ‌న్నాడు. ఏ క‌థ‌తో సీక్వెల్ చేస్తే బావుంటుందో సినిమా చూసి చెప్ప‌మ‌న్న ఆయ‌న సీక్వెల్ కోసమే ఇది రీరిలీజ్ అవుతుందేమో అని అన్నాడు. అయితే దిల్ రాజు ఈ సీక్వెల్ కు ఓపెన్ ఆఫ‌ర్ ఇవ్వ‌డం బాగానే ఉంది కానీ ఈ టైమ్ లో అలాంటి సినిమాకు సీక్వెల్ వ‌ర్క‌వుట్ అవుతుందా అనేది అస‌లు ప్ర‌శ్న‌.

గోదావ‌రి వాతావ‌ర‌ణం, ఏమీ చేయ‌కుండా కాల‌క్షేపం చేసే అన్నాద‌మ్ములు, మంచికి మారుపేరైన నాన్న‌, సీతారాముల లాంటి అమ్మానాన్న‌, ఇంటికి పెద్ద దిక్కుగా బామ్మ‌.. ఇవి త‌ప్ప క‌థ ప‌రంగా సీత‌మ్మ వాకిట్లో లో మ‌రేమీ ఉండ‌దు. జ‌స్ట్ ఎమోష‌న్స్ తో వ‌ర్కవుట్ అయిన సినిమా ఇది. దానికి తోడు హిట్ సినిమా తీయాల‌ని ప్లాన్ చేస్తే అది క్లాసిక్ అవ‌లేదు. అన్నీ కుదిరి ఆ సినిమా క్లాసిక్ గా నిలిచింది.

ఇప్పుడు అలాంటిది మ‌రో సినిమా తీయాలంటే క‌చ్ఛితంగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని చెప్ప‌లేం. పైగా ఇప్పుడు వెంకీ, మ‌హేష్ రేంజ్ బాగా పెరిగిపోయింది. సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత సినిమాల ఎంపిక విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటున్న వెంకీ ఈ సీక్వెల్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా అనేది అనుమాన‌మే.

ఇక మ‌హేష్ బాబు గురించి ఆలోచ‌న అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ వ‌రల్డ్ మూవీ చేస్తున్న ఆయ‌న ఆ సినిమా నుంచి ఫ్రీ అవ‌డానికే చాలా టైమ్ ప‌ట్ట‌నుంది. రాజ‌మౌళి మూవీ త‌ర్వాత ఏ హీరో అయినా పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ మూవీస్ చేయ‌డానికే ఆస‌క్తి చూపిస్తారు త‌ప్పించి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు లాంటి రీజ‌న‌ల్ ఫిల్మ్ చేయ‌డానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించ‌రు.

దానికి తోడు డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడ‌స‌లు ఫామ్ లో లేడు. పోనీ మంచి పాయింట్ దొరికితే కొంచెం టైమ్ తీసుకుని క‌థ రెడీ చేయించి వేరే హీరోల‌తో ముందుకెళ్దామంటే మార్కెట్ ప‌రంగా అస‌లు వ‌ర్క‌వుట్ అవ‌దు. ఆల్రెడీ వెంకీ- మ‌హేష్ ను చూసి ఉన్న ఆడియ‌న్స్ వేరే వాళ్ల‌ను అందులో యాక్సెప్ట్ చేయ‌రు. ఇన్ని సిట్యుయేష‌న్స్ లో ఈ సినిమాకు సీక్వెల్ క‌ష్ట‌మే అవుతుంది.

Tags:    

Similar News