యుగానికి ఒక్కడు-2పై డైరెక్టర్ యుటర్న్
ఐతే సీక్వెల్‌ను కార్తితో కాకుండా ధనుష్ హీరోగా కొన్నేళ్ల ముందు అనౌన్స్ చేసి పెద్ద షాకిచ్చాడు సెల్వ. కానీ ఆ సినిమా ఇప్పటిదాకా సెట్స్ మీదికి అయితే వెళ్లలేదు.;

దక్షిణాది నుంచి పాన్ ఇండియా సినిమాల చర్చే లేని సమయంలో అప్ కమింగ్ హీరో అయిన కార్తిని లీడ్ రోల్‌లో పెట్టి తమిళ విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ రూపొందించిన యుగానికి ఒక్కడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పుడున్న పరిమితుల్లో అలాంటి సినిమా తీయడం సామాన్యమైన విషయం కాదు. అందులో కథాంశం, విజువల్స్ చూసి ప్రేక్షకులు షాకైపోయారు. కాల క్రమంలో అదొక కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ మధ్య ఈ చిత్రాన్ని తెలుగులో రీ రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దర్శకుడు సెల్వ రాఘవన్‌కు కూడా ఆ ఆలోచన ఉంది. ఐతే సీక్వెల్‌ను కార్తితో కాకుండా ధనుష్ హీరోగా కొన్నేళ్ల ముందు అనౌన్స్ చేసి పెద్ద షాకిచ్చాడు సెల్వ. కానీ ఆ సినిమా ఇప్పటిదాకా సెట్స్ మీదికి అయితే వెళ్లలేదు. ఇప్పుడు ఆ మూవీ గురించి సెల్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు కూడా తాను ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ వచ్చి యుగానికి ఒక్కడు సీక్వెల్ ఎప్పుడు అని అడుగుతుంటారని.. తాను ఆ కథ గురించి కొన్నేళ్ల ముందు ధనుష్‌తో చర్చించానని సెల్వ తెలిపాడు. ఐతే తాము చేసిన తప్పేంటంటే.. ధనుష్ హీరోగా ఆ మూవీని తొందరపడి అనౌన్స్ చేసేయడమే అని సెల్వ తెలిపాడు. కార్తి లేకుండా యుగానికి ఒక్కడు-2 లేదని అతను స్పష్టం చేశాడు. తద్వారా సినిమా తీస్తే కార్తితోనే తీస్తానని.. ధనుష్‌తో కాదని అతను చెప్పకనే చెప్పేశాడు.
ఐతే యుగానికి ఒక్కడు-2 తీయడం అంత ఈజీ కాదని అతనన్నాడు. ఆ ప్రపంచాన్ని మళ్లీ తిరిగి తీసుకురావాలంటే చాలామంది ఆర్టిస్టులను ఒకచోటికి తీసుకురావాలని.. పెద్ద బడ్జెట్ పెట్టాలని.. ఇదంతా అంత సులువుగా సాధ్యమయ్యే విషయాలు కావని అతనన్నాడు. భవిష్యత్తులో కుదిరితే ఈ సినిమా చేస్తానని సెల్వ అన్నాడు. బృందావన కాలనీ-2 షూట్ 50 శాతం పూర్తయినట్లు ఈ సందర్భంగా సెల్వ వెల్లడించాడు.