కిడ్నాప్ కలకలం.. కమెడియన్లే టార్గెట్
సునీల్ పాల్ కేసు మీడియాలో హైలైట్ అయినప్పుడు కిడ్నాప్ ల గురించి బహిర్గతమైంది.
ప్రముఖ హాస్యనటుడు సునీల్ పాల్ కిడ్నాప్ కి గురయ్యాడని ఇటీవలే మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఇంతలోనే మరో హాస్య నటుడు, `స్త్రీ 2` ఫేం ముస్తాక్ ఖాన్ కూడా ఇదే విధంగా కిడ్నాప్ కి గురి కావడం హిందీ చిత్రసీమలో సంచలనంగా మారింది. ఈ కిడ్నాప్‌తో ఖాన్ కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
నవంబర్ 20న మీరట్‌లో జరిగిన ఒక అవార్డ్ షోకి ముస్తాక్ ఖాన్ ని ఆహ్వానించారని అతడి వ్యాపార భాగస్వామి శివమ్ యాదవ్ జాతీయ మీడియాకు వెల్లడించారు. అతడికి అడ్వాన్స్ చెల్లించడమే కాకుండా, విమాన టిక్కెట్లు కూడా అందించారు. దిల్లీలో దిగిన తర్వాత అతడిని కారులో ఎక్కాల్సిందిగా కోరారు. ఆ కార్ అతడిని బిజ్నోర్ సమీపంలోని నగర శివార్లకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. కిడ్నాపర్‌లు ఖాన్‌ను దాదాపు 12 గంటలపాటు చిత్రహింసలకు గురిచేసి కోటి రూపాయలను డిమాండ్ చేశారు. చివరికి కిడ్నాపర్లు ఖాన్ బ్యాంక్ ఖాతాలు, అలాగే అతడి కుమారుడి ఖాతా నుండి రూ. 2 లక్షలకు పైగా లూటీ చేసారు. తెల్లవారుజామున ఖాన్ ఆజాన్ విన్నప్పుడు తాను ఒక మసీదు సమీపంలో ఉన్నానని గ్రహించి, అక్కడి నుండి పారిపోయి స్థానిక ప్రజల నుండి సహాయం కోరాడు. పోలీసుల సహాయంతో ఇంటికి తిరిగి వచ్చాడు.
ఈ కిడ్నాప్ ముస్తాక్ ఖాన్ కుటుంబీకుల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఖాన్ స్వయంగా రాసి ఇచ్చిన వివరాల ప్రకారం.. అధికారిక ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ టికెట్, ఖాళీ అయిన బ్యాంకు ఖాతాలు, విమానాశ్రయానికి సమీపంలో ఉన్న సిసిటివి ఫుటేజీకి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయని అతడు తెలిపారు. ఖాన్ తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన పరిసరాలు, ఇరుగుపొరుగును, అతన్ని ఉంచిన ఇంటిని కూడా గుర్తించగలనని తెలిపాడు.
ఇంతకుముందు కూడా హాస్యనటుడు సునీల్ పాల్ కిడ్నాప్ ఘటనతో ఈ ఘటనకు పోలిక ఉండటం ఆశ్చర్యపరిచింది. ముస్తాక్ సంఘటనతో పోలిక ఏమిటన్నది పోలీసులు పరిశీలిస్తున్నారు. సునీల్ పాల్ కేసు మీడియాలో హైలైట్ అయినప్పుడు కిడ్నాప్ ల గురించి బహిర్గతమైంది. సినీపరిశ్రమ ఆర్టిస్టులకు కిడ్నాపర్లతో ఈ కొత్త చిక్కులేంటి? అంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. ముస్తాక్ ఖాన్ ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ స్త్రీ2లో తన నటనతో ఆకట్టుకున్నాడు. తన కిడ్నాప్ సంఘటన తో అతడు ఖంగు తిన్నాడు.
ఈవెంట్ ఆహ్వానాల ముసుగులో డబ్బు దోచేయడానికి దారి దోపిడీ సిండికేట్ ఇలాంటి ప్లాన్స్ వేస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది. ముస్తాక్ ఖాన్ వరుసగా హిట్ చిత్రాల్లో నటిస్తుండడంతో అతడి వద్ద భారీగా డబ్బు ఉందని కిడ్నాపర్లు 2 కోట్లు డిమాండ్ చేసారని కూడా ఊహిస్తున్నారు. ముఖ్యంగా ఈవెంట్ కి అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ కిడ్నాప్ చేసి డబ్బు దోచుకోవడం అనే నాటకం భయపెడుతోంది. ఇంతకుముందు సునీల్ పాల్ ని ఓ ఈవెంట్ కి అతిథిగా రావాల్సిందిగా పిలిచి దారిలో కిడ్నాప్ చేసి 20లక్షలు డిమాండ్ చేసిన ఘటన కలకలం రేపింది.