ప్రాపర్టీలను అద్దెకు ఇచ్చి కోట్లు ఆర్జిస్తున్న హీరో
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇటీవల ముంబైలోని తమ లగ్జరీ ప్రాపర్టీలను అద్దెకు ఇచ్చిన ప్రముఖుల జాబితాలో చేరారు.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇటీవల ముంబైలోని తమ లగ్జరీ ప్రాపర్టీలను అద్దెకు ఇచ్చిన ప్రముఖుల జాబితాలో చేరారు. రణ్వీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, నిర్మాత సాజిద్ నదియాడ్వాలా ఇటీవలి కాలంలో తమ ఆస్తులను అద్దెకు ఇచ్చిన వారిలో ఉన్నారు. అమితాబ్, బోనీ సహా పలువురు తమ అపార్ట్ మెంట్ల నుంచి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారని కథనాలొచ్చాయి.
ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ముంబైలోని ప్రతిష్టాత్మకమైన త్రీ సిక్స్టీ వెస్ట్- వర్లీలోని తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఇటీవల అద్దెకు ఇచ్చాడు. స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం...ఈ ఆస్తి 5,395 చ.అ (దాదాపు 501.21 చ.మీ) కార్పెట్ ప్రాంతం 573.78 చ.మీ (దాదాపు 6,175.42 చ.అ) అంతర్నిర్మిత ప్రాంతం, మూడు ప్రత్యేక కార్ పార్కింగ్ స్థలాలతో విస్తరించి ఉంది. వాస్తవానికి ఈ అపార్ట్ మెంట్ ని షాహిద్ మే 2024లో రూ. 58.6 కోట్లకు కొనుగోలు చేసారు. మీరా కపూర్ తో కలిసి షాహిద్ సంయుక్తంగా కొనుగోలు చేశారు. త్రీ సిక్స్టీ వెస్ట్, ఒబెరాయ్ రియాల్టీ అభివృద్ధి చేసిన ఫ్లాట్ ఇది. ఇది 1.58 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఈ సంస్థ 4- 5 బిహెచ్కే రెడి-టు-మూవ్-ఇన్ అపార్ట్మెంట్లను అందిస్తోంది. లీజు ఒప్పందం నవంబర్ 2024లో నమోదైంది. ఇది రూ. 1.23 కోట్ల ప్రాథమిక సెక్యూరిటీ డిపాజిట్‌తో 60 నెలల కాలానికి ఒప్పందం చేసుకున్నారు. స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం ప్రాపర్టీ సగటున 4-5 శాతం స్థూల అద్దె పెరుగుదలతో లీజు డీడ్ పూర్తయింది. నెలకు రూ. 20.5 లక్షలతో మొదలై ఐదేళ్ల వ్యవధి ముగిసే సమయానికి క్రమంగా రూ.23.98 లక్షలకు పెరుగుతుంది. అయితే ఈ ఒప్పందంలో మొదటి 10 నెలల పాటు అద్దె రహిత వ్యవధి ఉంటుంది.
షాహిద్ బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడు. ఒక్కో ప్రాజెక్టుకి 25-30 కోట్లు పైగా ఆర్జిస్తున్నాడు. ఫర్జీలో అతడి నటనకు మంచి పేరొచ్చింది. ఇది తనకు తొలి వెబ్ సిరీస్.. రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. కబీర్ సింగ్, జెర్సీ, హైదర్ లాంటి చిత్రాల్లో షాహిద్ నటనకు విమర్శకుల ప్రశంసలు కురిసాయి.