ఉదయం 5 గంటలకు నిద్ర

తన నిద్ర రోజుకు కేవలం 5 గంటలు మాత్రమే అంటూ షారుఖ్‌ ఖాన్‌ చెప్పిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా వైరల్‌ అవుతున్నాయి.

Update: 2024-08-17 12:30 GMT

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ పనై పోయింది, ఆయన నటించే సినిమాలు ఇక ఆడవు అనే టాక్ వినిపిస్తున్న సమయంలో బ్యాక్ టు బ్యాక్ పఠాన్‌, జవాన్‌ మరియు డుంకీ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు హిట్ లేక పోయినా కూడా ఆయన స్టార్‌ డమ్‌ చెక్కు చెదరలేదు అనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. షారుఖ్‌ ఖాన్‌ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి షారుఖ్ ఖాన్‌ ఏదో ఒక విషయం ద్వారా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా నిలుస్తూనే ఉన్నాడు.

తాజాగా తన రెగ్యులర్‌ దిన చర్య గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా ఇండియన్‌ స్టార్స్‌ రాత్రి 11 గంటలకు లేదా కాస్త అటు ఇటుగా 12 గంటలకు నిద్ర పోవడం మనం చూస్తూ ఉంటాం, కొందరు అంతకంటే ముందే నిద్ర పోవడం కూడా జరుగుతుంది. కానీ షారుఖ్ ఖాన్‌ మాత్రం ప్రతి రోజూ తెల్లవారు జామున 5 గంటలకు పడుకుంటాడట. తన నిద్ర రోజుకు కేవలం 5 గంటలు మాత్రమే అంటూ షారుఖ్‌ ఖాన్‌ చెప్పిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా వైరల్‌ అవుతున్నాయి.

ప్రతి రోజు 5 గంటలు మాత్రమే నిద్ర పోయే షారుఖ్‌ ఖాన్‌ తిండి విషయంలో కూడా అదే కఠిన నిబంధనలు ను పాటిస్తూ ఉంటాడట. రోజులో ఒక్క సారి మాత్రమే భోజనం చేస్తానని అన్నాడు. మద్యాహ్న సమయంలో షూటింగ్‌ వెళ్లే షారుఖ్‌ ఖాన్‌ అర్థరాత్రి 2 గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తాడట. అమెరికన్ నటుడు మార్క్ వాల్‌బర్గ్‌ నిద్రలోంచి లేచే సమయంలో షారుఖ్‌ ఖాన్‌ పడుకుంటాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించారు. ఇండియాలో ఉండి ఇలాంటి టైమింగ్స్ ను పాటిస్తున్న షారుఖ్‌ ఖాన్‌ ను చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకున్న షారుఖ్‌ ఖాన్ ఆ విజయాలను కంటిన్యూ చేసే విధంగా వరుసగా సినిమాలు చేయాలని, అందులో ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. వందల కోట్ల బడ్జెట్‌ సినిమాలు కాకుండా బడ్జెట్‌ విషయంలో కాస్త పరిమితులు విధించుకోవాలని కూడా షారుఖ్‌ ఖాన్ భావిస్తున్నాడు అంటూ బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News