భారతదేశపు తొలి సూపర్‌హీరో 'శక్తిమాన్' పాత్రలో
సరిగ్గా ఏడాది కిందట ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా తన శక్తిమాన్ అవతార్ ఆధారంగా తెరకెక్కే సినిమా గురించి వివరాలు వెల్లడించారు
90వ దశకంలో సూపర్‌హిట్ సీరియల్ గా నిలిచిని 'శక్తిమాన్' బుల్లి తెరపై ఓ సంచలనం. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమైన టీవీ సీరియల్ గా శక్తిమాన్ పాపులరైంది. హిందీలో డీడీ నేషనల్ లో ప్రసారం అయిన సీరియల్ ప్రాంతీయ భాషల్లోను గొప్ప ఆదరణ దక్కించుకుంది. 1997 నుంచి 2005 వరకు ఈ సీరియల్ ప్రసారం అయింది. భారతదేశంలో తొలి సూపర్ హీరో క్యారెక్టర్ గా శక్తిమాన్ కి పేరొచ్చింది. అప్పటి శక్తిమాన్ గా ముఖేష్ ఖన్నా నటించారు. నేటి జనరేషన్ లో ఈ పాత్రను పోషించేందుకు ఎవరు సూటబుల్? అంటూ సోషల్ మీడియాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతలోనే తాజా అప్ డేట్ అందింది.
సరిగ్గా ఏడాది కిందట ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా తన శక్తిమాన్ అవతార్ ఆధారంగా తెరకెక్కే సినిమా గురించి వివరాలు వెల్లడించారు. సోనీ పిక్చర్స్ గతేడాది ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఐకానిక్ శక్తిమాన్ పాత్రను పోషించడానికి నటుడు రణవీర్ సింగ్ ఎంపికయ్యాడని కథనాలొచ్చాయి. ఇప్పుడు మలయాళ నటుడు టోవినో థామస్ తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఇదే విషయాన్ని ధృవీకరించారు.
టోవినో థామస్ కొన్ని రోజుల క్రితం తన చిత్రం 2018 ఆస్కార్‌కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీ ఇస్తోందని ప్రకటించగానే ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యక్ష ప్రసారంలో దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో రణవీర్ కలిసి పనిచేయబోతున్నాడనే విషయాన్ని వెల్లడించాడు. టొవినో థామస్ ప్రాజెక్ట్ పేరును వెల్లడించనప్పటికీ రణవీర్ -బాసిల్ కాంబినేషన్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని సూచించాడు. రణ్‌వీర్ కూడా వారి మధ్య సంభాషణల్లో చేరాడు. అతడు మరిన్ని కామెంట్స్ కూడా చేశాడు. ''ఇక్కడ టొవినో x రణవీర్ ఎవరికి కావాలి?'' అని వ్యాఖ్యానించాడు. నేను ఏదో ఒక రోజు మీతో కలిసి నటించగలనని కోరుకుంటున్నాను. అద్భుతంగా ఉంటుంది! అని రణవీర్ ఆసక్తిని వ్యక్తం చేసాడు.
మరోవైపు టోవినో నటించిన 2018 మూవీ ఆస్కార్‌కి ఎంపికైనందుకు సంబరాలు చేసుకుంటున్నాడు. 2018 చిత్ర కథాంశం ఆసక్తికరం. 2018 సంవత్సరంలో కేరళలో సంభవించిన వినాశకరమైన వరదల నేపథ్యంలో ప్రజల కష్టనష్టాలపై తెరకెక్కిన సినిమా ఇది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, లాల్ తదితరులు నటించారు. ఈ సినిమా కోసం సెట్స్‌లో నిజ జీవిత వరద దృశ్యాన్ని పునఃసృష్టించారు. అది తెరపై కొన్ని అద్భుతాలు చేసింది. మా సందేశం స్పష్టంగా ప్రజల్లోకి వెళ్లింది. మేమంతా ఐక్యంగా పని చేయడం వల్లనే ఈ సినిమా పూర్తయింది అని తెలిపారు.
మరోవైపు రణవీర్ చివరిగా కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో కనిపించాడు. ఈ చిత్రం క్రిటిక్స్ ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ విజయాన్ని అందుకుంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న డాన్ 3లో ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు రణ్‌వీర్ ఇటీవల ప్రకటించాడు.