శంకర్ సారూ.. ఇది మీకు తగునా?
జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇవన్నీ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం తెరకెక్కించిన సినిమాలు.
జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇవన్నీ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం తెరకెక్కించిన సినిమాలు. అన్నీ ఘన విజయం సాధించిన చిత్రాలే. అయితే గత కొన్నేళ్లుగా శంకర్ తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన 'గేమ్ ఛేంజర్' కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచింది. దీనికి తోడు నిర్మాతతో డబ్బులను నీళ్లలా ఖర్చు పెట్టించాడని, ఐదు గంటల ఫుటేజీ తీసి ఎక్కువ వేస్ట్ చేశాడనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
'గేమ్ ఛేంజర్' మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, టేకింగ్ అంటూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో, అవుట్‌పుట్‌తో తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని చెప్పారు. రన్‌టైమ్ పరిమితి ఉన్నందున అనేక కీలకమైన ఎపిసోడ్‌లను తీసేయాల్సి వచ్చిందని చెప్పడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.
'గేమ్ ఛేంజర్' సినిమా గురించి శంకర్ మాట్లాడుతూ.. "ప్రతీ ఫిలిం మేకర్ కి కూడా ఎంత చేసినా పూర్తి సంతృప్తి ఉండదు. ఖచ్చితంగా నేను మరింత మెరుగ్గా చేయగలను. అవుట్‌పుట్‌తో నేను పూర్తిగా సంతృప్తి చెందలేదు. సినిమా మొత్తం ఫుటేజ్ 5 గంటలు వచ్చింది. కానీ సమయాభావం వల్ల చాలా మంచి సన్నివేశాలను ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దీంతో కథ అనుకున్న విధంగా రాలేదు" అని అన్నారు. రామ్ చరణ్, ఎస్‌జే సూర్యల నటనపై ప్రశంసలు కురిపించారు. యూట్యూబ్ లో తాను ఈ మూవీ రివ్యూలు చూడలేదని, ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చినట్లు తాను విన్నానని శంకర్ అన్నారు.
'గేమ్ ఛేంజర్' నిడివిపై శంకర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ తీయడానికి మూడున్నర ఏళ్ల సమయం తీసుకోవడమే కాకుండా, 5 గంటల పుటేజీని ఎలా తీసారంటూ నెటిజన్లు దర్శకుడిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా సినిమాలోని ప్రతి సన్నివేశం బోరింగ్ గా ఉంది. అలాంటి చిత్రాన్ని అందించి, ఇప్పుడేమో మంచి సీన్స్ ట్రిమ్ చేసినట్లుగా చెప్పటం ఏంటని శంకర్ ను విమర్శిస్తున్నారు.
అన్నీ కలుపుకొని 'గేమ్ ఛేంజర్' సినిమాకి దాదాపు రూ.400 - 500 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో కేవలం పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేసారు. టోటల్ ఫుటేజీ 5 గంటలు వస్తే, ఫైనల్ గా 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ తో సినిమాని రిలీజ్ చేసారు. అంటే 2 గంటల 15 నిమిషాలు ఎడిటింగ్ లో వృధాగా పోయింది. సుమారు ఒక సినిమాకి సరిపడా నిడివిని ట్రిమ్ చేశారంటే, ఎంత డబ్బు వేస్ట్ అయ్యిందనేది అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఇదే అని తెలుస్తోంది. ఒక సినిమాకి ఎంత లెన్త్ ఉండాలి, ఒక సీన్ ఎంత ఉండాలి అనేది పేపర్ మీదనే ఎడిటింగ్ చేసుకుని ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అలానే సినిమాలో స్క్రీన్ నిండా పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ ఉన్నా కానీ.. ఒక్కరికి కూడా సరైన పాత్ర రాయలేదు. కొందరు పాపులర్ యాక్టర్స్ కి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. అలాంటి పాత్రలకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి వారిని తీసుకోవడం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. ఈ విధంగా కూడా చాలా వరకూ బడ్జెట్ పెరిగింది. బడ్జెట్ కంట్రోల్ లో లేకుండా పోవడానికి కారణాలను పక్కన పెడితే.. ఇదంతా నిర్మాత దిల్ రాజుపై భారం పడేలా చేసింది. తమ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం ఆయన్ను కాస్త నిరాశ పరిచే విషయమనే అనుకోవాలి.
మామూలుగా దిల్ రాజు తన సినిమా లెక్కల విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. ముఖ్యంగా సమయం, డబ్బు వృధా కాకుండా జాగ్రత్త పడతారు. అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి 72 రోజుల్లో తీశారు. కానీ 'గేమ్ ఛేంజర్' విషయంలో ఈ ప్లానింగ్ మిస్సయింది. అందులోనూ ఇక్కడ దర్శకుడు శంకర్ కాబట్టి దిల్ రాజు కూడా బడ్జెట్ ను కంట్రోల్ చెయ్యలేకపోయారనే మాట వినిపిస్తోంది. రిజల్ట్ ఏంటనేది అటుంచితే.. ఒక సినిమా కోసం 5 గంటల పుటేజీ తీయడం వల్లనే బడ్జెట్ పెరిగిందనే అభిపాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.