'భారతీయుడు 2'.. క్రిటిసిజమ్ పై శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆ సమయంలో తన మీద వచ్చిన క్రిటిసిజమ్ పై శంకర్ తాజాగా స్పందిస్తూ.. విమర్శల నుంచి ఎవరూ తప్పించుకోలేరని, దాన్నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యమని అన్నారు.

Update: 2025-01-09 14:16 GMT

స్టార్ డైరెక్టర్ శంకర్ తన రేంజ్ కు తగ్గ సక్సెస్ సాధించి చాలా కాలం అయింది. ఈసారి తప్పకుండా హిట్టు కొట్టాలని 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన చిత్రమిది. మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్రోలింగ్, క్రిటిసిజమ్ పై స్పందించారు.

గతేడాది శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'భారతీయుడు 2' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకుడి పనితీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. టేకింగ్ బాగాలేదని, షోమ్యాన్ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయాడంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు. ఆ సమయంలో తన మీద వచ్చిన క్రిటిసిజమ్ పై శంకర్ తాజాగా స్పందిస్తూ.. విమర్శల నుంచి ఎవరూ తప్పించుకోలేరని, దాన్నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యమని అన్నారు.

"క్రిటిసిజమ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదొక సందర్భంలో తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరూ దాని నుండి తప్పించుకోలేరు. ఎవరైనా దేన్నైనా విమర్శించవచ్చు. అయితే మనం మంచి విమర్శలను స్వీకరించి, తదుపరి ప్రాజెక్టులలో వాటిని మెరుగ్గా అమలు చేయడానికి ప్రయత్నించాలి" అని శంకర్ చెప్పారు. 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా రిలీజైన తర్వాత, కమల్ హాసన్ తో 'భారతీయుడు 3' పనులు ప్రారంభించనున్నట్లుగా అగ్ర దర్శకుడు తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో ఫ్యూచర్ లో తాను బయోపిక్‌ అంటూ తీస్తే సూపర్ స్టార్ రజనీకాంత్‌ లైఫ్ స్టోరీని తెరకెక్కిస్తానని శంకర్‌ చెప్పారు. ప్రస్తుతానికైతే ఏదైనా బయోపిక్‌ తీయాలనే ఆలోచన తనకు లేదని, ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే మాత్రం రజనీ బయోపిక్‌నే చేస్తానని స్పష్టం చేశారు. రజనీకాంత్‌ ఎంతో గొప్ప వ్యక్తి అని, ఈ విషయం అందరికీ తెలుసని ఈ సందర్భంగా దర్శకుడు అన్నారు. అలానే 'గేమ్ చేంజర్' సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ గా 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా రూపొందింది. ఇది యువ ఐఏఎస్, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడి మధ్య యుద్ధంగా పేర్కొనబడింది. దీనికి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా.. శంకర్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ తండ్రీ కొడుకులుగా రెండు భిన్నమైన పాత్రల్లో, విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్.జె సూర్య విలన్ గా చేశారు. ఎస్.థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు.

Tags:    

Similar News