శర్వా36 కోసం పవన్ మూవీ టైటిల్?
ఈ మధ్య టాలీవుడ్ యంగ్ హీరోలంతా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పాత సినిమాలను వాడుకోవడం మొదలుపెట్టారు.
ఈ మధ్య టాలీవుడ్ యంగ్ హీరోలంతా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పాత సినిమాలను వాడుకోవడం మొదలుపెట్టారు. ఆయన పాటల దగ్గర నుంచి, ఆయన సినిమా టైటిల్స్ వరకు వేటినీ వదలడం లేదు. ఇప్పటికే పవన్ కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన తొలిప్రేమ సినిమాను ఆయన అన్నయ్య కొడుకు వరుణ్ తేజ్ తీసి మంచి హిట్ అందుకున్నాడు.
తమ్ముడు సినిమాను పవన్ కళ్యాణ్ వీరాభిమాని నితిన్ ఆల్రెడీ తీసేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. విజయ్ దేవరకొండ ఖుషి అనే టైటిల్ ను వాడేసుకుని యావరేజ్ రిజల్ట్ అందుకున్నాడు. రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ ను తీసుకున్నాడు.
పవన్ సినిమా టైటిల్సే కాదు, తన పాటల్లోని పదాలను కూడా యంగ్ హీరోలు టైటిల్స్ గా వాడుకుంటున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం, కెవ్వు కేక లాంటి సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కూడా పవన్ టైటిల్ పై కన్నేసినట్టు తెలుస్తోంది.
శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అభిలాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్, శర్వానంద్ కు తండ్రి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు జానీ అనే టైటిల్ ను పెట్టాలని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఖుషి సూపర్ హిట్ తర్వాత పవన్ నటించిన జానీ సినిమా అప్పట్లో మంచి హైప్ తో రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది. కానీ టైమ్ గడుస్తున్న కొద్దీ జానీ సినిమాకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు ఫ్యాన్స్ తో ఓ స్పెషల్ కనెక్షన్ ఉంది. అలాంటి సినిమా టైటిల్ ను శర్వా వాడుకోవడం పట్ల పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.