'బండిట్ క్వీన్' వివాదంపై ప్రైమ్ వివరణ!
ఎక్స్ వేదికగా ప్రైమ్ లో ప్రసారమవుతోన్న బండిట్ క్వీన్ తాను సినిమా కాదని...చిత్రం గుర్తించలేనంతంగా మారిపోయిందని మండిపడ్డారు.;
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన 'బండిట్ క్వీన్' అమెజాన్ స్ట్రీమింగ్ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. సినిమాలో చాలా సన్నివేశాలకు తన అనుమతి లేకుండా కత్తెర వేసి స్ట్రీమింగ్ చేయడంపై శేఖర్ కపూర్ ఓటీటీ దిగ్గజంపై నిప్పుల వర్షం కురిపించారు. ఎక్స్ వేదికగా ప్రైమ్ లో ప్రసారమవుతోన్న బండిట్ క్వీన్ తాను సినిమా కాదని...చిత్రం గుర్తించలేనంతంగా మారిపోయిందని మండిపడ్డారు.
అదీ తన పేరుతో స్ట్రీమింగ్ అవ్వడం చూసి షాక్ కి గురయ్యానన్నారు. తనకు తెలియకుండా అమెజాన్ సెన్షార్ షిప్ చేయడం ఏంటి? హాలీవుడ్ సినిమాలకు లేదా? క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలను ఇలాగే అనుమతి లేకుండా కత్తిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దర్శకుల కష్టాన్ని..శ్రమని వివరించే ప్రయత్నం చేసారు. ఇప్పుడు వారి అవసరాల కోసం సినిమాని ఇలా కత్తిరిస్తారా? అంటూ మండిపడ్డారు.
ఈ వివాదంపై హన్సల్ మోహతా కూడా భారతీయ సినిమాలను ఇలా అవమానిస్తారా? అంటూ ఆగ్రహ వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో శేఖర్ కపూర్ వ్యాఖ్యలపై ప్రైమ్ వీడియో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న వెర్షన్‌కు తాము ఎటువంటి సవరణ చేయలేదని పేర్కొంది. స్ట్రీమింగ్ వెర్షన్‌ను దాని పంపిణీదారు ఎన్ హెచ్ స్టూడియోస్ అందించిందని ప్రైమ్ వీడియో ప్రతినిధి తెలిపారు.
తాము ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లే చూపించామని...ఎవర్నీ కించ పరిపరిచే ఉద్దేశంతో స్ట్రీమింగ్ చేయలేదని పేర్కొన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై శేఖర్ కపూర్ రియాక్షన్ ఎలా ఉంటుందో? చూడాలి. బండిట్ క్వీన్ 1994లో రిలీజ్ అయింది. భారతీయ డాకాయిట్ ఫూలన్ దేవి జీవిత చరిత్ర ఆధారంగా శేఖర్ కపూర్ తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫూలన్ దేవి పాత్రలో సీమా బిస్వాస్ నటించారు.