RC16 : సూపర్ స్టార్ లుక్ టెస్ట్ డన్.. త్వరలో సెట్స్‌కి
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే.;
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే. ఇన్ని రోజులు రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై కీలక సన్నివేశాలు రూపొందించిన బుచ్చిబాబు త్వరలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌తో షూటింగ్ చేయబోతున్నారు. గత ఏడాదిలోనే ఈ సినిమాలో శివరాజ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే శివరాజ్ కుమార్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న కారణంగా బుచ్చిబాబు తన నిర్ణయం మార్చుకుని ఆయన స్థానంలో మరో సీనియర్ నటుడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ బుచ్చిబాబు తాను అనుకున్న ప్రకారం శివ రాజ్ కుమార్‌నే నటింపజేస్తున్నాడు.
డిసెంబర్ నెలలో శివ రాజ్ కుమార్ క్యాన్సర్ కి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి దాదాపు మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుని క్యాన్సర్ ఫ్రీ అయిన శివ రాజ్ కుమార్ ఈ నెల నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. కర్ణాటకలోని శివరాజ్ ఇంటికి వెళ్లి బుచ్చిబాబు లుక్ టెస్ట్ చేశారు. లుక్ టెస్ట్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియోను కాస్త తీక్షణంగా చూస్తే శివరాజ్ కుమార్ హెవీ మేకప్‌తో ఓల్డ్ మెన్ గెటప్‌లో కనిపించబోతున్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా బుచ్చిబాబు సినిమాలో ప్రతి పాత్రకు చాలా వెయిట్ ఉంటుంది. అలాంటిది సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను తీసుకుంటే మరింత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటింపజేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
శివరాజ్ కుమార్ పాత్ర ఏంటి, లుక్ ఎలా ఉంటుంది అనే విషయాలపై స్పష్టత ఇవ్వకుండా లుక్ టెస్ట్ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్ పూర్తి అయింది, త్వరలోనే సెట్స్‌లో ఆయన జాయిన్ కాబోతున్నారని అందులో పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెంట్టింగ్‌లో రామ్ చరణ్‌తో కలిసి శివ రాజ్ కుమార్ షూటింగ్‌లో పాల్గొంటారనే టాక్ వినిపిస్తుంది. ఈ నెలలోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు గాను బుచ్చిబాబు చాలా స్పీడ్‌గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయిస్తున్నాడని సమాచారం. రామ్ చరణ్, శివ రాజ్ కుమార్ కాంబో సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు.
స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న RC16 సినిమాలో చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా కోసం మూడు నాలుగు పాటలను రెహమాన్ రికార్డ్ చేశారని తెలుస్తోంది. ఈ నెలలోనే రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో పాటు గ్లిమ్స్ లేదా టీజర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అంతకు ముందు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఫిజిక్ చాలా మార్చుకున్నాడని సమాచారం అందుతోంది.
ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో పాటు, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కావడం వల్ల RC16 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇదే ఏడాది దసరా లేదా దీపావళికి అది వీలు కాకుంటే క్రిస్మస్ వరకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో RC16 సినిమాను 2025లో విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ రొమాన్స్‌తో పాటు, అతి పెద్ద స్పోర్ట్స్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ సినిమా ఫలితం గురించి అనుమానం అక్కర్లేదని బల్లగుద్ది మరీ చెప్పాడు. దాంతో మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు మరింతగా పెరిగాయి.