'షోలే' నటీనటుల పారితోషికాలు
రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన `షోలే` భారతీయ సినిమాల్లో ఒక ఇతిహాసం. తరతరాల ప్రేక్షకుల హృదయాలను రంజింపజేసిన క్లాసిక్ సినిమా ఇది
రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన `షోలే` భారతీయ సినిమాల్లో ఒక ఇతిహాసం. తరతరాల ప్రేక్షకుల హృదయాలను రంజింపజేసిన క్లాసిక్ సినిమా ఇది. సంజీవ్ కుమార్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, అమ్జాద్ ఖాన్, హేమ మాలిని, జయ బచ్చన్ వంటి దిగ్గజ తారలు ఈ చిత్రంలో నటించారు. నటీనటులంతా శాశ్వతంగా ముద్ర వేసే మరపురాని నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలోని పాత్రలకు స్టార్లు ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. క్లాసిక్ డే సినిమాల్లో సంచలన వసూళ్లను సాధించిన ఈ సినిమాతో నిర్మాత భారీగా ఆర్జించారు. కానీ ఆర్టిస్టుల పారితోషికాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.
దాదాపు రూ. 3 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ప్రధాన నటుల్లో ధర్మేంద్రకు రూ. 1,50,000 పారితోషికం చెల్లించగా, సంజీవ్ కుమార్ కు రూ. 1,25,000 చెల్లించారు. అమితాబ్ రెండవ హీరోగా నటించినా సంజీవ్ కుమార్ కంటే తక్కువ పారితోషికం లభించింది. అమితాబ్ కేవలం రూ. 1,00,000 పారితోషికం అందుకున్నారు. బసంతి పాత్ర పోషించిన హేమ మాలిని తన పాత్రకు రూ. 75,000 పారితోషికం తీసుకున్నారు. గబ్బర్ సింగ్ తో అద్భుతమైన అరంగేట్రం చేసిన అమ్జద్ ఖాన్ తన మొదటి చిత్రానికి రూ. 50,000 పారితోషికం అందుకున్నారు. రాధ పాత్ర పోషించిన జయ బచ్చన్ కేవలం రూ. 35,000 మాత్రమే అందుకున్నారు. సాంబ పాత్ర పోషించిన మాక్ మోహన్ కు రూ. 12,000 ఫీజు, కాలియా పాత్ర పోషించిన విజు ఖోటేకు రూ. 10,000 .. ఇమామ్ సాబ్ పాత్ర పోషించిన ఎకె హంగల్ కు రూ. 8,000 మాత్రమే పారితోషికం లభించింది.
లీలా మిశ్రా, సచిన్ పిల్గావ్కర్, అలంకార్ జోషి, మేజర్ ఆనంద్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఎన్.హెచ్ స్టూడియోజ్ - సిప్పీ ఫిల్మ్స్ నిర్మించిన షోలే బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అద్భుత కథ, కథనం, నట ప్రదర్శనలు, మ్యూజిక్, దర్శకత్వ ప్రతిభ ఇలా అన్ని విభాగాల్లో మెప్పు పొందిన చిత్రమిది.