హాలీవుడ్‌లో సాహో శ్రద్ధ?
ఇదిలా ఉంటే, బాలీవుడ్ నుంచి పలువురు నటీమణులు హాలీవుడ్ లో నటించనున్నారని కథనాలొస్తున్నాయి.
బాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు హాలీవుడ్‌లో షైన్ అయ్యారు. సీనియర్ నటి టబు, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, ఐశ్వర్యారాయ్, నర్గీస్ ఫక్రీ, జాక్విలిన్ ఫెర్నాండెజ్ తదితరులు హాలీవుడ్‌లోను సినిమాల్లో నటించారు. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా అక్కడ వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ తన హవా సాగిస్తోంది. ఇటీవల ఆలియా భట్ కూడా వండర్ ఉమెన్ గాల్ గాడోట్‌తో కలిసి ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటించింది.
ఇదిలా ఉంటే, బాలీవుడ్ నుంచి పలువురు నటీమణులు హాలీవుడ్ లో నటించనున్నారని కథనాలొస్తున్నాయి. కానీ శ్రద్ధా కపూర్ లాంటి క్రేజ్ ఉన్న ప్రతిభావని హాలీవుడ్ కి వెళ్లకపోవడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. శ్రద్ధా పూర్తిగా బాలీవుడ్ కి మాత్రమే అంకితమైంది. `సాహో` లాంటి భారీ పాన్ ఇండియన్ చిత్రంలో నటించిన శ్రద్ధా ఆ తర్వాత కేవలం హిందీ సినిమాలు మాత్రమే చేస్తోంది. పైగా ఏడాదికి ఒక సినిమా లో మాత్రమే నటిస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ మారింది. శ్రద్ధా లాంటి ట్యాలెంటెడ్ నటికి హాలీవుడ్ లో పెద్ద స్థాయికి ఎదిగేందుకు ఛాన్సుంది. కానీ ఎందుకు ప్రయత్నించడం లేదు? అన్న సందేహం అభిమానులకు ఉంది.
అయితే శ్రద్ధా కపూర్ కి హాలీవుడ్ దిగ్గజాలతో అంతకంతకు సాన్నిహిత్యం పెరుగుతోందని తాజాగా రిలీజైన ఫోటోగ్రాఫ్ చెబుతోంది. శ్రద్ధా కపూర్, హృతిక్ రోషన్ హాలీవుడ్ దిగ్గజాలు మోర్గాన్ ఫ్రీమాన్, సర్ ఆంథోనీ హాప్కిన్స్, అమండా సెయ్ ఫ్రైడ్, హాన్స్ జిమ్మెర్, మాథ్యూ మెక్ కోనాఘే , స్వరకర్త హాన్స్ జిమ్మెర్ వంటి ప్రముఖులతో కలిసి ఉన్న ఒక వైరల్ ఫోటో చూశాక దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది ఓ అవార్డ్ వేడుకల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫ్. శ్రద్ధా కపూర్, అమండా సెయ్ ఫ్రైడ్ పక్కన కూర్చుని ఉండగా, హృతిక్ రోషన్ ఎదురుగా కూచుని కనిపిస్తున్నారు. వారి వెనుక, మోర్గాన్ ఫ్రీమాన్ మాథ్యూ మెక్ కోనాఘే దగ్గర నిలబడి ఉన్నారు. ఈ ఫోటోలో సర్ ఆంథోనీ హాప్కిన్స్, హాన్స్ జిమ్మెర్, క్యూబా గూడింగ్ జూనియర్, క్రిస్టినా అగ్యిలేరా, ఆండ్రియా బోసెల్లి, మైఖేల్ బుబ్లే, గై రిచీ, మైక్ ఫ్లానాగన్, మార్టిన్ లారెన్స్ తదితర దిగ్గజ తారలు ఉన్నారు.
అభిమానులు ఈ ఫోటోగ్రాఫ్ వీక్షించాక గర్వించదగిన క్షణం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కలయిక చూస్తుంటే శ్రద్ధా కపూర్, హృతిక్ కూడా హాలీవుడ్ లో పెద్ద స్టార్లతో కలిసి సినిమాలు చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ అభిమానులు ప్రియాంక చోప్రా తరహాలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నారు. శ్రద్ధా ఇటీవలే స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ లో నటించింది. హృతిక్ సరసన సిద్ధార్థ్ ఆనంద్ `ఫైటర్`లో కనిపించింది. శ్రద్ధా నాగిని పాత్రలో నటించనుందని కొద్దిరోజులుగా కథనాలొస్తున్నాయి. కానీ తన తదుపరి భారీ చిత్రం గురించి వెల్లడించాల్సి ఉంది.