పుష్ప 2కి భయపడటం లేదు - సిద్దార్ధ్
సిద్ధార్ధ్ చివరిగా ‘భారతీయుడు 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సిద్ధార్ద్ గత కొన్నేళ్ల నుంచి మాతృభాష తమిళంలోనే ఎక్కువ మూవీస్ చేస్తున్నారు. అయితే సిద్ధార్ధ్ చేసిన ప్రతి తమిళ్ మూవీ తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు అలా వచ్చిన వాటిలో ఏది తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేదు. డిఫరెంట్ కథలతో ప్రయాణం చేస్తున్న సాలిడ్ సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. సిద్ధార్ధ్ చివరిగా ‘భారతీయుడు 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సినిమా ఫలితం ఏంటనేది అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే తమిళంలో సిద్ధార్ధ్, ఆషికా రంగనాథ్ జోడిగా సిద్ధమైన ‘మిస్ యు’ మూవీ అదే టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ప్రేమకథా చిత్రంగా ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నవంబర్ 29న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. ఇదిలా ఉంటే మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసి మీడియా మీట్ లో సిద్ధార్ధ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మీ సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత ‘పుష్ప 2’ థియేటర్స్ లోకి వస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న ఆ సినిమాతో మీ చిత్రానికి ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా అని ఓ జర్నలిస్ట్ అడిగారు. దానికి సిద్దార్ధ్ మాట్లాడుతూ నా కంట్రోల్ లో ఉన్నదాని గురించి నేను ఏమైనా మాట్లాడగలను. నా కంట్రోల్ లో లేని వాటి గురించి నేను మాట్లాడకూడదు. అలాగే ప్రతి సినిమా కూడా పెద్ద సినిమానే. ఒక బడ్జెట్ బట్టి సినిమాని పెద్ద చిన్న అని కేలిక్యులేట్ చేయకూడదు.
ఈ సినిమా 7 రోజుల తర్వాత కూడా సెకండ్ వీక్ లో కొనసాగాలంటే చాలా విషయాలు జరగాలి. అందులో ముఖ్యంగా నా సినిమా బాగుండాలి. ఆడియన్స్ కి నచ్చాలి. అది జరిగితే తరువాత వచ్చే సినిమా గురించి వాళ్ళు ఆలోచించాలి. భయపడాలి. నాకు ఇక్కడ ప్రాబ్లెమ్ లేదు. నా సినిమా బాగుంటే కచ్చితంగా థియేటర్స్ లో ఉంటుంది. ఒక మంచి సినిమాని ఎవరు కూడా థియేటర్స్ లోంచి తీయలేరు.
ఈ టైం పీరియడ్ లో అలాంటిది అస్సలు జరగదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్ని చూస్తున్నారు. 2006-07 లో అయితే అలాంటిది చేయొచ్చు. అప్పుడు సోషల్ మీడియా అవగాహన అంతగా లేదు కాబట్టి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం జరుగుతుందనేది చూస్తున్నారు. మంచి సినిమాని ఎవరు థియేటర్స్ లోంచి తీయలేరని సిద్ధార్ధ్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.