అప్పుడలా.. ఇప్పుడిలా.. ఏం జరిగింది 'మిస్ యూ' సిద్ధార్థ్?
హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు వంటి పలు సినిమాలతో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు వంటి పలు సినిమాలతో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. తన యాక్టింగ్ తో అనేక సినిమాల్లో అలరించారు. చివరగా గత ఏడాది చిన్నా మూవీతో వచ్చి సాలిడ్ హిట్ అందుకున్నారు సిద్ధార్థ్. రీసెంట్ గా మిస్ యూ మూవీలో యాక్ట్ చేశారు.
లవ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ రాజశేఖర్ తెరకెక్కించగా.. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. సామ్యూల్ మాథ్యూ నిర్మించిన ఆ సినిమా నవంబర్ 29.. అంటే నేడే రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళంలో పలు ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
కానీ నేడు సినిమా రిలీజ్ కాలేదు. అలా అని వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వచ్చే వారం మోస్ట్ అవైటెడ్ భారీ మూవీ పుష్ప-2 రిలీజ్ కానుంది. దీంతో ఆ వారం ఇంకా ఏ సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం లేదు!
ముందు వీక్ అయిన ఇప్పుడు కూడా ఎలాంటి చిత్రాలు సందడి చేయలేదు. కానీ సిద్ధార్థ్ తన సినిమాతో రావాలని ఫిక్స్ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. రిస్క్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. అదే విషయంపై ఓ ఈవెంట్ లో పుష్ప-2 వచ్చే సమయంలో మీ మూవీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారన్న క్వశ్చన్ కు సిద్ధార్థ్ స్పందించారు.
తన సినిమా బాగుంటే థియేటర్లో నుంచి దాన్ని ఎవ్వరూ తీసే ఛాన్స్ లేదని అప్పుడు తెలిపారు. ఒకప్పుడు సోషల్ మీడియా పెద్దగా లేదని, కాబట్టి సినిమాల గురించి పెద్దగా తెలిసేది కాదని చెప్పారు. ఇప్పుడు సినిమా బాగుంటే దాన్ని థియేటర్ల నుంచి ఎవ్వరూ తీయలేరని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అనేక మంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సిద్ధార్థ్ కు కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ నమ్మకం ఉందేమో అనుకున్నారు. కట్ చేస్తే నేడు సినిమా రిలీజ్ అవ్వకపోవడంతో అంతా సిద్ధార్థ్ అప్పుడు చేసిన కామెంట్స్ పై స్పందిస్తున్నారు. ఏమైంది సిద్ధార్థ్ ? ఎందుకు మూవీ రాలేదని అడుగుతున్నారు. మరెప్పుడు రిలీజ్ చేస్తారు? వాయిదా వేయడానికి కారణమేంటి? అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి సిద్ధార్థ్ స్పందిస్తారోమో చూడాలి.