రానాకు కండిషన్ పెట్టిన సిద్దూ
అయితే ప్రెజెంటర్ గా ఆల్రెడీ సక్సెస్ అయిన రానా కు ఓ కండిషన్ పెట్టాడట స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ.
టాలీవుడ్ హీరోల్లో రానా దగ్గుబాటి మల్టీ టాలెంటెడ్ హీరో అని చెప్పొచ్చు. ఓ వైపు హీరోగా, మరోవైపు హోస్ట్ గా, నిర్మాతగా, ప్రెజెంటర్ గా అన్నీ రంగాల్లో దూసుకెళ్తున్నాడు. రానా హీరోగా సినిమా వచ్చి చాలా రోజులైంది. అలా అని అతనేమీ ఆడియన్స్ కు దూరంగా లేడు. ఈ గ్యాప్ లో తను పలు సినిమాలకు సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీ అయ్యాడు.
రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో ది రానా దగ్గుబాటి అనే టాక్ షోను కూడా స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్ గా రన్ చేస్తున్నాడు. అయితే ప్రెజెంటర్ గా ఆల్రెడీ సక్సెస్ అయిన రానా కు ఓ కండిషన్ పెట్టాడట స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. సిద్దూ జొన్నలగడ్డతో రానా ఓ సినిమాను ప్లాన్ చేశాడట. సిద్దూ ఆ సినిమాను చేయాలంటే రానా కు తానొక కండిషన్ పెట్టాడని స్వయంగా రానానే చెప్పాడు.
కోవిడ్ టైమ్ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాను రీరిలీజ్ చేస్తేనే తనతో సినిమాకు ఒప్పుకుంటానని కండిషన్ పెట్టాడని, వాస్తవానికి ఇది రీరిలీజ్ కాదని, మొదటిసారి ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుందని రానా చెప్పుకొచ్చాడు. సిద్దూ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ నటించిన ఈ సినిమా కరోనా టైమ్ లో రిలీజై చాలా మందిని ఆకట్టుకుంది.
ఈ సినిమా ద్వారానే సిద్దూ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. అయితే కరోనా టైమ్ అవడంతో ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడా సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కాకపోతే టైటిల్ ను మాత్రం ఇట్స్ కాంప్లికేటెడ్ అని పేరు మార్చారు. ఆడియన్స్ ఈ సినిమాను థియేటర్లలో చూశాక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఉందని సిద్దూ తెలిపాడు.
సినిమా మొదటిసారి థియేటర్లలో రిలీజవుతున్న సందర్భంగా హీరో సిద్దు, డైరెక్టర్ రవికాంత్ పేరేపుతో పాటూ రానా కూడా రంగంలోకి దిగి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాను థియేటర్లలో చూడాలని ఓటీటీలో రిలీజైన టైమ్ లో చాలా మంది భావించారని, వారి కోసమే ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు సిద్దు తెలిపాడు.