బాలయ్యతో విజయవాడకు సిద్ధు, విశ్వక్

తాజాగా సీనియర్ నటుడు బాలకృష్ణతో కలిసి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ విజయవాడ వెళ్లారు.

Update: 2024-09-12 14:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వరదలు ఎలాంటి బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తమ వంతు సహాయంగా ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. వారిలో ఒక్కొక్కరు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు బాలకృష్ణతో కలిసి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ విజయవాడ వెళ్లారు.

హైదరాబాద్ నుంచి బయలుదేరి తొలుత గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు బాలయ్య, విశ్వక్, సిద్ధు. అనంతరం అక్కడి నుంచి విజయవాడ వెళ్లారు. ఆ తర్వాత నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి చెక్కులు అందజేయనున్నారు. అయితే బాలయ్య.. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున ప్రకటించారు. సిద్ధు చెరో రాష్ట్రానికి రూ.15 లక్షలు, విశ్వక్ సేన్ ఒక్కో స్టేట్ కు రూ.5 లక్షలు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

అయితే గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాక.. బాలయ్య మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు గారికి చెక్కులు అందజేయడానికి వచ్చినట్లు తెలిపారు. "కనీవినీ ఎరుగని వర్ష ప్రభావం వల్ల జనజీవనం అంతా అతలాకుతలమై పోయింది. ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా నాన్నగారు రాష్ట్రాలకు సహాయం చేసేవారు. ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అంతరంగాలు ఒకటే. యాసలు వేరైనా మన భాష తెలుగు భాష" అని బాలకృష్ణ చెప్పారు

"ఒక ప్రాంతానికి ఆపద వస్తే ఇంకో ప్రాంతాన్ని భాగం చేయడం వంటి పనులను నాన్నగారు చేసేవారు. అందరినీ కలిపి మిగతా వారిని ఆదుకునేలా చేసేవారు. తెలుగు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సినీ ఇండస్ట్రీ తన వంతు సహకారం అందిస్తుంది. గతంలో పలు సందర్భాల్లో ఎన్టీఆర్ జోల పట్టి మిగతా ప్రాంతాలు తిరిగి విరాళాలు సేకరించారు.బేధాలు ఉన్నా అందరూ హెల్ప్ చేసుకోవాలి. ఇప్పుడు కళాకారులు అంతా స్పందించారు. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో పాటు ఎంతో మంది రెస్పాండ్ అయ్యారు" అని బాలయ్య తెలిపారు.

"అయితే ఎవరి షూటింగ్స్ లో వారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు మాకు ఖాళీ దొరికింది. అందుకే సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించిన సహాయాన్ని అందించడానికి వచ్చాం. మిగతా వారు కూడా వాళ్లకు వీలు దొరికినప్పుడు.. వచ్చి ఇచ్చి వెళ్తారు" అని బాలయ్య తెలిపారు. కాగా, వరదలను ప్రభుత్వం సృష్టించిందని కొందరు వ్యక్తులు వ్యాఖ్యానించడం.. హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వరద బాధితుల కోసం సహాయం చేసిన వారందరికీ బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News