అల్లు అర్జున్ దారిలో అనుష్క..?!

'పుష్ప' సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తే.. 'ఘాటీ' మూవీ కథంతా గంజాయి వ్యాపారం చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది.

Update: 2024-12-18 17:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మూడేళ్ల క్రితం వచ్చిన 'పుష్ప: ది రైజ్' మూవీకి సీక్వెల్ ఇది. శేషాచలం అడవుల్లో కూలీగా ప్రయాణం ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ఫస్ట్ పార్ట్ లో చూపించారు. సెకండ్ పార్ట్ లో పుష్పరాజ్ స్మగ్లింగ్ సిండికేట్ ను ఎలా రూల్ చేశాడు? తన ఆధిపత్యాన్ని ఎలా కొనసాగించాడు? ఏకంగా రాష్ట్ర సీఎంను మార్చే స్థాయికి ఎలా చేరుకున్నాడు? అనేది తెర మీద ఆవిష్కరించారు. అయితే ఇప్పుడు 'ఘాటీ' సినిమా కూడా అలాంటి పాయింట్ తోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

సౌత్ క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ''ఘాటీ''. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు మేకర్స్ చెబుతూ వస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం వేరే ఊరికి వలస వెళ్లిన గిరిజన యువతి.. తనకు జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవడమే కాదు, నేర సామ్రాజ్యాన్ని రూల్ చేసే మహారాణిగా, ఒక లెజెండ్ గా ఎలా ఎదిగిందనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్ అని అంటున్నారు.

'పుష్ప' సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తే.. 'ఘాటీ' మూవీ కథంతా గంజాయి వ్యాపారం చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అక్కడ పుష్పరాజ్ రూల్ చేసినట్లే, ఇక్కడ అనుష్క రూల్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, అనుష్క 'వేదం' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. యాదృచ్ఛికంగా ఆ చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ క్రిష్.. ఇప్పుడు 'ఘాటీ' సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన "ఘాటీ" ఫస్ట్ లుక్, టీజర్ లో అనుష్కను మాస్ అవతార్‌ లో మోస్ట్ వైలెంట్ పాత్రలో ప్రజంట్ చేశారు. అనుష్క బస్సు ఎక్కి ఒక మనిషి మెడను అత్యంత కిరాతకంగా కోయడం.. ఆ తలను పట్టుకొని పొలాల్లో నడుకుంటూ వెళ్లే సన్నివేశంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనేది అర్థమవుతుంది. ఒక హీరోయిన్ కు ఇలాంటి ఇంటెన్స్, మాస్ ఎలివేషన్ సీన్ పెట్టడం మామూలు విషయం కాదు.

అనుష్క గతంలో నటించిన 'అరుంధతి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి విమెన్ సెంట్రిక్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో హిట్టు కొట్టింది. ఈ క్రమంలో రాబోతున్న ''ఘాటీ" కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2025 ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Tags:    

Similar News