గాంధీజీ పాకిస్తాన్ పితామహడు.. బుక్కయిన గాయకుడు
అయితే అభిజీత్ భట్టాచార్య నుంచి దీనిపై ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతానికి అంతా స్థబ్ధుగా ఉంది.
దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే సంగీత ప్రపంచంలో ఆర్‌డి బర్మన్ జాతిపిత అని వ్యాఖ్యానించాడు ప్రముఖ గాయకుడు అభిజీత్ భట్టాచార్య. ఆర్‌డి బర్మన్‌ను మహాత్మా గాంధీతో పోల్చారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. ''మహాత్మా గాంధీ పాకిస్తాన్ దేశానికి పితామహుడు .. భారతదేశానికి కాదు`` అని ప్లేబ్యాక్ సింగర్ భట్టాచార్య వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
సహజంగానే సోషల్ మీడియా ఇలాంటి పరిణామాల కోసం ఆవురావురుమని ఎదురు చూస్తుంది. ఆ ఒక్క వ్యాఖ్యతో అతడిపై నెటిజనులు విరుచుకుపడ్డారు. మహాత్మా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలను నేరంగా పరిగణించిన లాయర్లు కూడా సీరియస్ అయ్యారు. అడ్వొకేట్ అసిమ్ సరోదే గాంధీజీపై ఈ వ్యాఖ్యలకు భేషరతుగా భట్టాచార్య క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసును పంపారు. రాతపూర్వకంగా క్షమాపణలు కూడా కోరారు. ఎన్నో ఏళ్లుగా హిందూ-ముస్లిం సమాజం కోసం గాంధీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలను అందరికీ గుర్తు చేసిన న్యాయవాది అసిమ్ సరోదే ఇండియా-పాక్ విభజనను గాంధీజీ ఎలా వ్యతిరేకించారో కూడా చెప్పారు. గాంధీజీకి ఉన్న ప్రపంచవ్యాప్త గుర్తింపు దృష్ట్యా ఆయనపై గౌరవంతో 150 దేశాల్లో పోస్టల్ స్టాంపులు ఆవిష్కరించిన విషయాన్ని లాయర్ గుర్తు చేసారు.
అయితే అభిజీత్ భట్టాచార్య నుంచి దీనిపై ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతానికి అంతా స్థబ్ధుగా ఉంది. అభిజీత్ ఇటీవల పాడ్ కాస్టుల పేరుతో వరసగా వివాదాలను టచ్ చేస్తున్నాడు. మర్చిపోయిన అతడిని అందరూ గుర్తు చేసుకునేలా చేస్తున్నాడు. ఇటీవల అతడు సింగింగ్ కి దూరంగా ఉన్నాడు. నిర్మాతగా సొంత బ్యానర్ లో సినిమాలు తీస్తున్నాడు. అందువల్ల బయటి చిత్రాలకు పాడడు. అతడు ఖాన్ ల త్రయంలో సల్మాన్, షారూఖ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తద్వారా సోషల్ మీడియాల్లో అందరి అటెన్షన్ ని తనవైపునకు తిప్పేసుకుంటున్నాడు. ఇదంతా ప్రచారపుటెత్తుగడ అని కూడా విమర్శల్ని ఎదుర్కొంటున్న అభిజీత్ భట్టాచార్య సూపర్ సీనియర్ గాయకుడు. బాలీవుడ్ లో వందలాది హిట్ పాటలను పాడాడు.