సితారకు సంయుక్త సెంటిమెంట్ పట్టుకుందా?
ఇందులో సూర్య హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే స్టోరీ విన్న సూర్య ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.;

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. అభిరుచి గల నిర్మాతగా మంచి పేరుతెచ్చుకున్న సూర్యదేవర నాగవంశీ విభిన్నమైన కథలతో అటు పెద్ద చిత్రాలు, ఇటు యూత్ మెచ్చే సినిమాలు చేస్తూ నిర్మాతగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే క్రేజీ స్టార్లతో సినిమాలు చేస్తున్నాడు. విజయ్ దేవరకొండతో `కింగ్‌డమ్` మూవీని నిర్మిస్తున్న సూర్యదేవర నాగవంశీ త్వరలో మరో భారీ మల్టీలింగ్వల్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారు.
దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. ఇదే బ్యానర్‌లో నితిన్‌తో `రంగ్ దే`, ధనుష్‌తో `సార్`, దుల్కర్ సల్మాన్‌తో `లక్కీ భాస్కర్ వంటి వరుస విజయాల్ని దక్కించుకుని హ్యాట్రిక్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. తాజా ప్రాజెక్ట్ సితారలో వెంకీ అట్లూరికి నాలుగవ సినిమా కాబోతోంది. ఇందులో సూర్య హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే స్టోరీ విన్న సూర్య ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇందులో సూర్యకు జోడీగా ఇద్దరు క్రేజీ హీరోయిన్‌లు నటించబోతున్నారు.
ఓ హీరోయిన్‌గా `మిస్టర్ బచ్చన్` ఫేమ్ భాగ్యశ్రీ బోర్సేని అనుకుంటున్నారట. మరో నాయిక పాత్ర కోసం `డ్రాగన్` ఫేమ్ కయదు లోహర్‌ని పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ క్యారెక్టర్ కోసం కయదును కాకుండా సంయుక్త మీనన్‌ని తీసుకోవాలని సితార వంశీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సితారలో సంయుక్త ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించింది. `భీమ్లానాయక్`లో రానాకు జోడీగా కనిపించిన సంయుక్త మీనన్ ఆ తరువాత `సార్` మూవీలో ధనుష్‌కు జోడీగా నటించింది.
ఇప్పుడు సూర్య ప్రాజెక్ట్‌కు ఫైనల్ అయితే సితార తనకిది హ్యాట్రిక్ ఫిల్మ్ కానుంది. ఒక బ్యానర్‌లో వరుసగా ఒకే హీరోతో సినిమాలు చేసిన వారున్నారు. కానీ ఒకే హీరోయిన్‌తో మూడు సినిమాలు చేసిన సంస్థలు టాలీవుడ్‌లో చాలా అరుదు. ఆ విషయంలో సితార ముందు నిలుస్తోందని, సితారకు సంయుక్త సెంటిమెంట్ పట్టుకుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.