మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కి ఖ‌రీదైన వాచ్ కానుకిచ్చిన హీరో

బహుమతి అందుకున్న ఆనందంలో శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ జీవీ ప్రకాష్ కుమార్ వాచ్ ఫోటోని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు.

Update: 2024-11-09 13:09 GMT

శివకార్తికేయన్ నటించిన 'అమరన్' బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిల‌వ‌డ‌మే గాక ఇప్ప‌టికే 170కోట్లు వ‌సూలు చేసింది. ఈ స‌క్సెస్ ని చిత్ర‌బృందం సెల‌బ్రేట్ చేసుకుంటోంది. ముఖ్యంగా హీరో శివ‌కార్తికేయ‌న్ స‌క్సెస్ కిక్కులో ఎడా పెడా బ‌హుమ‌తుల‌ను వెద‌జ‌ల్లుతున్నాడు. శివకార్తికేయన్ తన 'అమరన్' సంగీత స్వరకర్త జివి ప్రకాష్ కుమార్‌కు విలాసవంతమైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. అద్భుతమైన హై-ఎండ్ వాచ్ ని చూసి జీవీ ఆశ్చర్యపోయాడు.

ఆ ఇరువురి న‌డుమా కేవ‌లం వృత్తిప‌ర‌మైన స్నేహం మాత్ర‌మే కాదు.. బలమైన వ్యక్తిగత అనుబంధం గొప్ప‌ది అని ప్రూవ్ అయింది. అమ‌రన్ ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మొద‌టి సినిమానే అయినా కానీ, ఇది చాలా ప్ర‌త్యేక‌మైన‌ది.. చిరస్మరణీయమైనది. ఈ బహుమతి జివి ప్రకాష్ అంకితభావం, ప్రతిభ పై శివకార్తికేయన్‌కు ఉన్న అభిమానానికి సింబ‌ల్ గా భావించాలి.

ముఖ్యంగా 'అమరన్'లో ఘాఢ‌మైన భావోద్వేగాలతో కూడిన ప్రపంచానికి జీవం పోయడానికి జీవీ ప్ర‌కాష్ చేసిన కృషి విస్మరించ‌లేనిది. ఈ కానుక స‌ముచిత‌మైన‌ద‌ని అభిమానులు కూడా భావిస్తున్నారు. బహుమతి అందుకున్న ఆనందంలో శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ జీవీ ప్రకాష్ కుమార్ వాచ్ ఫోటోని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన 'అమరన్' కథాంశం ఆస‌క్తిక‌రం. భారతీయ ఆర్మీ అధికారి దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం, వీరత్వం ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. ఈ జీవిత చరిత్ర డ్రామా లో మేజర్ పాత్ర‌ను మ‌లిచిన తీరు ఆక‌ట్టుకుంది.

దేశభక్తి, కర్తవ్యం, ఆత్మ‌ గౌరవం నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే స‌న్నివేశాల‌ను తెర‌పై చూపించారు. మేజ‌ర్ జీవితంలో ఎదురైన సవాళ్లు, చేప‌ట్టిన‌ మిషన్లు ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రను పోషించాడు. సాయి పల్లవి ముకుంద్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను పోషించింది. అమరన్ మొదటి వారం థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసాక‌ రూ. 170 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం 200 కోట్ల క్ల‌బ్ వైపు దూసుకుపోతోంది.

Tags:    

Similar News