SK25 లాంచ్: ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలి
కృషి, ప్రణాళిక ఉంటే విజయం తన వెంటే ఉంటుందని నిరూపించాడు శివకార్తికేయన్.
కృషి, ప్రణాళిక ఉంటే విజయం తన వెంటే ఉంటుందని నిరూపించాడు శివకార్తికేయన్. అతడు తన కెరీర్ ఆరంభం అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనప్పుడు హైదరబాద్ ప్రెస్ మీట్‌లో మీడియా కూడా అంతగా పట్టించుకున్నదే లేదు. కానీ ఇప్పుడు అతడు ఎదిగిన తీరుకు అదే మీడియా సలాం కొడుతోంది. శివకార్తికేయన్ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ 25 సినిమాల కెరీర్ ని టచ్ చేస్తున్నాడు. ఇటీవల అతడి సినిమాలు తెలుగులో కూడా రెగ్యులర్‌గా అనువాదమై విడుదలవుతున్నాయి.
మొన్న `అమరన్` సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు శివకార్తికేయన్. తెలుగు వెర్షన్ పాజిటివ్ సమీక్షలతో విజయం సాధించింది. అమరన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత సంఘటనలతో రాసిన `ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ` పుస్తకం ఆధారంగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కమల్ హాసన్ సమర్పణలో తెరకెక్కించాయి. ఆర్మీ మేజర్ ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటనకు ప్రశంసలు కురిసాయి.
ఇప్పుడు శివకార్తికేయన్ కెరీర్ 25వ సినిమాలో నటిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఊహాగానాల తర్వాత ఆకాశం నీ హద్దురా ఫేం సుధా కొంగరతో శివకార్తికేయన్ చేయబోయే చిత్రం శనివారం (15 డిసెంబర్ 2024) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆసక్తికరంగా ఈ చిత్రంలో తని ఒరువన్ ఫేం జయం రవి, యువహీరో అధర్వ కూడా కీలక పాత్రలలో నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రెడ్ జియాంట్ మూవీస్- డాన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాత్కాలికంగా SK25 అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ చిత్రంతో గుంటూరు కారం ఫేం శ్రీలీల కథానాయికగా తమిళ చిత్రసీమకు పరిచయమవుతోంది. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జీవీప్రకాష్‌కి స్వరకర్తగా ఇది 100వ చిత్రం కావడం గమనార్హం.
శివకార్తికేయన్ 25వ ప్రాజెక్ట్ కంటే ముందే AR మురుగదాస్ తెరకెక్కిస్తున్న SK23 విడుదలయ్యేందుకు ఛాన్సుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. శివకార్తికేయన్ సినిమాతో పాటు మురుగదాస్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సికందర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.